ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ స్ఫూర్తితో..

8 Aug, 2021 05:03 IST|Sakshi

ట్రీ బ్యాంక్‌ స్థాపించి మొక్కలు నాటుతున్న షోలాపూర్‌ జిల్లావాసి

ఇప్పటికే 18 గ్రామాల్లో 4,700 మొక్కలు నాటిన లక్ష్మణ్‌ కాకడే

షోలాపూర్‌: కరోనా రెండో వేవ్‌ సమయంలో రాష్ట్రానికి 300 టన్నుల ఆక్సిజన్‌ సరఫరా చేసి ఆదుకున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి షోలాపూర్‌ జిల్లా కరమాల తాలూకా విటూ గ్రామానికి చెందిన లక్ష్మణ్‌ కాకడే వీరాభిమానిగా మారాడు. వైఎస్‌ జగన్‌ స్ఫూర్తితో దాదాశ్రీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ట్రీ బ్యాంక్‌ స్థాపించి షోలాపూర్‌ జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాడు. ఇప్పటికే తమ చుట్టుపక్కలున్న 18 గ్రామాల్లో 4,700 మొక్కలు నాటాడు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా లక్ష్మణ్‌ కాకడే పిలుపునిచ్చారు.

ఎల్లప్పుడూ ముఖంలో చిరునవ్వు, సాదాసీదా దుస్తులతో ఉండే ఇలాంటి ముఖ్యమంత్రిని తాను ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ సేవలకు తాను ఆకర్శితుడినయ్యానని చెప్పారు. ట్రీ బ్యాంకు ద్వారా కరమాల తాలూకాలో ఉన్న 118 గ్రామాల్లోని పాఠశాలల ఆవరణల్లో పండ్ల మొక్కలు నాటాలని సంకల్పించినట్లు తెలిపారు. ఒక్కో పాఠశాల పరిధిలో 25–30 మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజున హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌కు వెళ్లి, ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. అందుకు పదిహేను రోజుల ముందే ఇక్కడి నుంచి సైకిల్‌పై బయలుదేరతానని పేర్కొన్నారు. తాను ఏమీ ఆశించకుండానే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరిట సహాయ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఆయన తనను వెన్ను తట్టి వెల్‌డన్‌ అంటే చాలని, తన జీవితం ధన్యమవుతుందని అన్నారు. 

మరిన్ని వార్తలు