సీటు కావాలంటే ‘సీఈటీ’ రాయాల్సిందే

25 Jul, 2021 00:56 IST|Sakshi
సాంకేతిక లోపంతో వెబ్‌సైట్‌ పని చేయట్లేదని కనిపిస్తున్న సందేశం

ఈసారి ‘సీఈటీ’ఆధారంగానే ఇంటర్‌ ప్రవేశాలు 

పదో తరగతి మెరిట్‌కు ప్రాధాన్యం శూన్యం 

మూల్యాంకన ఫలితాల నేపథ్యంలో మారిన ప్రవేశాల ప్రక్రియ 

సీఈటీకి రిజిస్ట్రేషన్‌ చేసేందుకు తప్పని తిప్పలు 

ముంబై సెంట్రల్‌: ఇంటర్‌ మొదటి సంవత్సరంలో (11వ తరగతి) అడ్మిషన్‌ కోసం కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీఈటీ) పరీక్షలో వచ్చిన మార్కులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో మూల్యాంకనం ఆధారంగా వెలువడ్డ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి మార్కులు సాధించినప్పటికీ కాలేజీల్లో సీట్లు లభించడం కష్టతరం కానుంది. సీఈటీలో మంచి మార్కులు సాధించినవారికి అడ్మిషన్లు ఇచ్చిన తర్వాతే మిగతావారికి అవకాశం లభించనుంది. గతంలో పదో తరగతి పరీక్షల్లో 90 శాతం, ఆపైన మార్కులు సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌ పద్ధతిలో నేరుగా తమకు ఇష్టమైన కాలేజీలో, ఇష్టమైన సబ్జెక్ట్‌లో ప్రవేశం పొందేవారు. కళాశాలలు కూడా 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకే ప్రాధాన్యత ఇచ్చేవి. కానీ, కరోనా మహమ్మారి వల్ల ఈసారి పరిస్థితులు మారాయి. పదో తరగతి పరీక్షల ఫలితాలను అంతర్గత మూల్యాంకన పద్ధతిలో వెలువరించారు. దీంతో కళాశాలలు ఆ ఫలితాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.

అంతేగాక, ప్రతీ ఏడాదిలా కాకుండా ఈసారి కాలేజీల్లో ప్రవేశాలకు సీఈటీ పరీక్షలు పాస్‌ కావాలనే మెలిక పెట్టడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పైగా, సీఈటి పరీక్షలు ఆఫ్‌లైన్‌లో జరగనున్నాయి. రాష్ట్ర సిలబస్‌ ప్రకారం ఈ సీఈటీ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో ఆ సిలబస్‌లో చదివిన విద్యార్థులకు ఎక్కువ ఇబ్బంది కలగదు. కానీ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులు సీఈటీ పరీక్షలు పాసవ్వాలంటే కష్టపడాల్సి వస్తుందని విద్యా విభాగ పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి సీఈటీ ఆప్షనలే అయినప్పటికీ, ఈ ఏడాది మాత్రం సీఈటీలో పాసైన విద్యార్థులకే ప్రముఖ కాలేజీలు ప్రాధాన్యత ఇవ్వనున్నాయని స్పష్టమవుతోంది.

ముందుగా సీఈటీ ద్వారా సీట్లను భర్తీ చేసుకున్నాకే మిగతా విద్యార్థులకు ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు. గత సంవత్సరం ముంబైలో పదకొండో తరగతిలో ప్రవేశాల కోసం మొదటి లిస్ట్‌లో 90 శాతం కంటే ఎక్కువ మార్కులు లభించిన వారికే అవకాశం కల్పించారు. కామర్స్, సైన్స్‌ విభాగాల్లో ప్రముఖ కాలేజీల్లో మొదటి కట్‌ ఆఫ్‌ 95 శాతం మించిపోయింది. 85 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు తమకు ఇష్టమైన కాలేజీల్లో ప్రవేశాల కోసం రెండో లిస్ట్‌ వరకు ఎదురు చూడక తప్పలేదు. అయితే, ఈ సంవత్సరం మాత్రం మారిన పరిస్థితుల నేపథ్యంలో సీఈటీ పరీక్ష ఫలితాల కట్‌ ఆఫ్‌నే పరిగణనలోకి తీసుకోనున్నారు.  

పనిచేయని వెబ్‌సైట్‌.. 
సీఈటీ పరీక్ష కోసం విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించిన వెబ్‌సైట్‌ సాంకేతిక కారణాలతో పనిచేయడం లేదు. దీంతో విద్యార్థులలో అయోమయం కనిపిస్తోంది. ముఖ్యంగా ఫలితాల అనంతరం సీఈటీ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసిన మొదటి రోజే సర్వర్‌లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కొందరు మాత్రమే సీఈటీ పరీక్షలకు తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోగలిగారు. రెండో రోజు మరికొందరు నమోదు చేసుకున్నప్పటికీ జూలై 22వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో మరో సమస్య ఏర్పడింది. ఇలా అనేక సమస్యలతో శనివారం కూడా వెబ్‌సైట్‌ పనిచేయలేదు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌ కోసం జూలై 26వ తేదీ వరకు ఇచ్చిన గడువును పెంచనున్నారని సమాచారం. ఇదిలావుండగా సీఈటీ పరీక్షలు ఆగస్టు 21వ తేదీన జరగనున్నాయి. అయితే, ఈసారి ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లోనే ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి లాంటి ప్రక్రియలు సెప్టెంబర్‌ వరకు పూర్తి అవుతాయని, అక్టోబర్‌లో కాలేజీలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు