International Literacy Day: అందరికీ విద్య అందేదెన్నడు?

8 Sep, 2022 05:10 IST|Sakshi

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ అక్షరాస్యతలో ఇంక వెనుకబడే ఉన్నాం. 2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. విద్యా రంగంలో నెలకొన్న సవాళ్లతో పాటు పులి మీద పుట్రలా కరోనా మహమ్మారి విసిరిన పంజాతో  100% అక్షరాస్యత సుదూర స్వప్నంగా మారింది. ప్రజల్లో విద్యపై అవగాహన పెంచడానికి యూనెస్కో ప్రతీ ఏడాది సెప్టెంబర్‌ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.1966 నుంచి విద్యపై విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రపంచ నిరక్షరాస్యుల్లో  34% మంది భారత్‌లోనే ఉండడం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత 2.4 కోట్ల మంది తిరిగి బడిలో చేరలేదు. వారిలో 1.1 కోట్ల మంది అమ్మాయిలున్నారు.

కరోనా ప్రభావం
కరోనా లాక్‌డౌన్లతో దేశంలో 15లక్షల స్కూళ్లు మూత పడ్డాయని, 24.7 కోట్ల విద్యార్థులు ఏడాది పాటు చదువుకి దూరమయ్యారని యునెస్కో వెల్లడించింది. తర్వాత కూడా 30% విద్యార్థులు తిరిగి స్కూళ్లలో చేరలేదని చెబుతోంది.

సాధించిన పురోగతి ఇదీ..  
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి ఇప్పటివరకు అక్షరాస్యతలో గణనీయమైన పురోగతి సాధించాం. ఏడేళ్ల వయసు కంటే ఎక్కువ ఉన్న వారు ఏదో ఒక భాషలో చదవడం, రాయడం వస్తే వారిని అక్షరాస్యులుగా పరిగణిస్తారు. 1951లో 18.3% ఉన్న అక్షరాస్యత రేటు 2022 వచ్చేసరికి 77.7శాతానికి పెరిగింది. మొదట్లో అక్షరాస్యతలో లింగ వివక్ష అధికంగా ఉండేది. దానిని కూడా క్రమక్రమంగా దాటుకుంటూ వస్తున్నప్పటికీ  అమ్మాయిల్లో అక్షరాస్యత ఇంకా సవాళ్లు విసురుతోంది.

1961లో కేవలం 15.4% మంది మహిళా జనాభా అక్షరాస్యులైతే ఆ తర్వాత పదేళ్లకి 1971లో 22% 2001 నాటికి 53.7% , 2022 నాటికి 70శాతం మహిళలు అక్షరాస్యులయ్యారు. అన్నింటికంటే మైనార్టీ విద్యార్థుల్లో  డ్రాప్‌అవుట్‌ల నివారించడంలో భారత్‌ కొంతమేరకు విజయం సాధించింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం 2015–16లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు దాదాపుగా 9% ఉన్న డ్రాపవుట్లు 2020–21కి 0.8శాతానికి తగ్గాయి. ప్రాథమిక పాఠశాలలు 10 రెట్లు పెరిగాయి.

ఎదురవుతున్న సవాళ్లు  
సంపూర్ణ అక్షరాస్యత సాధనకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. పేదరికం, తల్లిదండ్రుల అవగాహన లేమి, లింగ, కుల వివక్ష, సదుపాయాల లేమి, సాంకేతిక పరిజ్ఞానం అందకపోవడం వంటివన్నీ భారత్‌లో అనుకున్న స్థాయిలో అక్షరాస్యతను పెంచలేకపోతున్నాయి. గ్రామీణ నిరుపేదలకు స్కూళ్లు అందుబాటులో ఉండటం లేదు. పూట గడవని ఉండే కుటుంబాలు పిల్లల్ని పలక బలపం బదులు పలుగు పార పట్టిస్తున్నారు. దేశంలో ఏకంగా కోటి మంది చిన్నారులు బడికి వెళ్లడానికి బదులుగా బాలకార్మికులుగా మారారు.

2022 నాటికి పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత 87.7% ఉంటే గ్రామీణ భారతంలో 73.5% ఉన్నట్టుగా నేషనల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నివేదిక చెబుతోంది. దీనికి కారణం గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రులకే అక్షరజ్ఞానం లేకపోవడంతో  వారికి చదువు ప్రాధాన్యం గురించి తెలియక పిల్లల్ని బడికి పంపించడం లేదు. అమ్మాయిల్లో అక్షరాస్యత తక్కువగా ఉండడానికి బాల్య వివాహాలు,  పాఠశాలల్లో టాయిలెట్‌ సదుపాయం లేకపోవడమే ప్రధాన కారణాలని పలు సర్వేల్లో తేలింది. ఇప్పటికీ దేశంలో 40% పాఠశాలల్లో టాయిలెట్‌ సదుపాయం లేదు. జీడీపీలో 6% విద్యా రంగానికి ఖర్చు చేస్తేనే అక్షరాస్యత రేటు పెరుగుతుందని నిపుణులు సూచిస్తూ ఉంటే 3% కూడా పెట్టడం లేదు.
            
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు