ఇది మహిళా నాయకత్వ సంవత్సరం

8 Mar, 2021 08:23 IST|Sakshi

ఓ ఏడాది వచ్చినట్టు మరో ఏడాది మార్చి 8 ఉండదు. నూట పది సంవత్సరాల మార్చి ఎనిమిది శ్రామిక మహిళల సంఘర్షణల మైలురాళ్లు నాటుకుంటూ వస్తున్నది. గతేడాది పౌరసత్వం మా హక్కంటూ గడగడ వణికించే చలిలో రోడ్డుపై నిరవధిక శాంతియుత సత్యాగ్రహానికి కూర్చున్న వేలాదిమంది మహిళల పట్టుదల నివ్వెరపరిచింది. అబద్ధపు ప్రచారాలనీ, విద్వేషపు దాడుల్నీ, అనేక కుట్రల్నీ తట్టుకుంటూ దాదాపు మూడునెలలు దేశవ్యాప్తంగా వందల బైఠాయింపులు జరిగాయి. అవన్నీ దాదాపుగా మహిళల చొరవతో, మహిళల నిర్వహణతో నడచినవే. దేశ చరిత్రలో మొదటిసారి పురుషులు సహకార భూమికలో దర్శనమిచ్చారు. ఇప్పుడు నాలుగో నెలలోకి చేరిన రైతుల సత్య సంగ్రామానికి పునాది షాహీన్‌బాగ్‌. ధరల నిరంతర పెరుగుదల, కోల్పోయిన ఉపాధి, మూతబడిన సూక్ష్మ, చిన్న, మధ్య గృహ పరిశ్రమలు, పెరిగిపోతున్న నిరుద్యోగం, ఇంటాబయటా పెరిగిపోతున్న హింస... వీటితో విసిగి అధికార నిచ్చెనలో అట్టడుగున ఉండే మహిళలు ‘ఇక చాలు’ అంటున్నారు.

వ్యవసాయ ఆర్డినెన్స్‌లు వచ్చిన నాటి నుండి మహిళా రైతులు, కూలీలు వాటిని అర్థం చేసుకున్నారు. ‘మా పొలాల్లో మేమే కూలీలుగా మారే కార్పొరేటు, కాంట్రాక్టు వ్యవసాయ విధానం’ వద్దన్నారు. ఊరూరు, ఇల్లిల్లూ తిరిగారు. ఈ చట్టాల గురించి వివరించారు. ఊరేగింపులు చేశారు. టోల్‌ప్లాజాల వద్ద ధర్నాలు చేశారు. ఢిల్లీకి చేరారు. ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. భయపడలేదు. నిరంతరాయంగా సాగుతున్న ఢిల్లీ సరిహద్దుల ముట్టడిలో వారు వేదిక నిర్వాహకులు, స్త్రీల ప్రత్యేక కార్యక్రమాల రూపకర్తలు, తీర్మానాల రచయిత్రులు, యాంకర్లు, ఎకౌంటెంట్లు, వంటలక్కలు, పది చేతుల్తో పనులు చక్కబెట్టే ఉద్యమకారులు. లంగరు (సామూహిక వంటశాల)లో ఎక్కువ భాగం పనులన్నీ పురుషులే చేయటం గమనార్హం.

ఎక్కడ అవసరం అయితే అక్కడికి ట్రాలీల నిండా వండిన ఆహారంతో ట్రాక్టరు స్వయంగా నడుపుకుంటూ పోయే 80 ఏళ్ల నవనీత్‌ సింగ్‌ చాలా మామూలుగా చెబుతుంది, ‘నా భర్త పోయాక నేనే 50 ఏళ్లుగా వ్యవసాయం చేసి కుటుంబాన్ని ఒక దారికి తెచ్చాను. ఈ చట్టాలతో నా కుటుంబ ఆధారమే నేలమట్టం అవుతుంది. ఎంతకాలం అయినా పట్టని చట్టాలు వాపస్‌ తీసుకోవాల్సిందే’ అని. అసంఖ్యాకమైన స్త్రీల మాదిరి గానే ‘బతకడం కోసం ఏది అవసరం అయితే అది చెయ్యాలి’ అనేది ఆమె జీవన సూత్రం. మనుగడ ప్రశ్నార్థకం అయ్యింది కాబట్టే ఈరోజు స్త్రీలు ఉద్యమాల అనుచరులుగా, సహచరులుగా ఉండే పాత్రనుదాటి రూపకర్తలుగా, సమన్వయకారులుగా నిలబడుతున్నారు. వంటపని, ఇంటిపని, పిల్లల పెంపకం, వృద్ధుల సేవలు, బయట ఉపాధి వ్యవహారం... బహుళ ముఖ్యమైన పనులు ఒకేసారి చక్కబెట్టే వారి సామర్థ్యం ఉద్యమాల్లో భిన్న పాత్రలు అలవోకగా పోషించడానికి అనుభవాన్నిచ్చింది కనుకనే వంతులవారీ సరిహద్దుల ముట్టడిలో వుంటూ, ఊరేగింపులు, ధర్నాలు స్థానికంగా నిర్వహిస్తూ... వ్యవసాయ పనులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉద్యమాల కోసం వెళ్లిన సహచరుల చేలను కూడా పండిస్తున్నారు.

భారీ మద్దతు
ఒకప్పుడు ఖాప్‌ పంచాయతీల్లో స్త్రీలకు ప్రవేశం లేదు. అక్కడ స్త్రీలకు ప్రతికూల నిర్ణయాలే ఎక్కువ. ఇవాళ కిసాన్‌ పంచాయతీల్లో మేలిముసుగులు తొలగించి రాజపుత్రులు, జాట్‌ స్త్రీలే కాకుండా దళిత మహిళలు సైతం వేదికలెక్కి ఉపన్యాసాలిస్తున్నారు. తీర్మానాలు చేస్తున్నారు. శతాబ్దాలుగా కరడుగట్టిన ఆధిపత్య వ్యవస్థల్ని ఈ ఉద్యమం బీటలు వారుస్తున్నది. విచిత్రంగా ప్రపంచ వేదిక నుండి ఈ ఉద్యమానికి భారీ మద్దతు లభించింది కూడా ప్రధానంగా ప్రాచుర్యంగల స్త్రీల నుంచే. ఒక రియానా, ఒక గ్రేటా థన్‌బర్గ్‌ అధికార పీఠం కింద భూకంపం పుట్టించారు. విశ్వవిద్యాలయాల ఉద్యమం నుండి నేటి రైతు ఉద్యమం దాకా యువతులపై, స్త్రీలపై ప్రభుత్వ దాడులు అరెస్టులు సర్వసాధారణం అయ్యాయి. కార్మిక కర్షక సమన్వయానికి ప్రతీకగా నిలిచిన నవదీప్‌కౌర్‌తో పాటు హిందీ సినీ మహిళా తారలు కూడా ప్రభుత్వ కక్ష సాధింపులకు ఎరవుతున్నారు. రైతులకు మద్దతు ఇవ్వడమే వారి పాపం.

కరోనా కాలంలో అంతులేకుండా పెరిగిపోయిన గృహ హింస, ఇంటి చాకిరీకి తోడు మానసిక, శారీరక, లైంగిక హింస... పడిపోయిన ఆదాయాలు, గందరగోళం అయిన విద్యా సామాజిక జీవనం, అన్నింటినీ తట్టుకుని కుటుంబాలను సాధారణ స్థితికి చేర్చడానికి స్త్రీలు  తాపత్రయపడ్డారు. గత సంవత్సరం వారి అస్తిత్వమే ఒక పోరాటంగా మారింది. అయినా స్త్రీలు ఓడిపోవడానికి నిరాకరించారు. డెన్మార్క్, ఇథియోపియా, ఫిన్‌లాండ్, జర్మనీ, ఐస్‌లాండ్, న్యూజిలాండ్, స్లోవాకియాతోపాటు 20 దేశాలకు అధినేతలుగా ఉన్న మహిళలు కోవిడ్‌కు సత్వరంగా స్పందించారు. సమర్థవంతంగా నివారించారు. కనుకనే ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం, ఈ ఏడాది మార్చి 8ని ‘నాయకత్వంలో స్త్రీలు– కోవిడ్‌ 19 ప్రపంచంలో సమానత్వ సాధన కోసం’ అనే నినాదంతో జరుపుకోవాలని పిలుపిచ్చింది. 

‘మీటూ’ ప్రియారమణికి, పర్యావరణ కార్యకర్త దిశా రవికి న్యాయస్థానాలిచ్చిన తీర్పులు స్త్రీలు తమపై జరిగే హింసపై మాట్లాడటానికి, భూమిపై తమ హక్కును ప్రకటించడానికి భరోసా కల్పించాయి. బాధితులయిన పసిబిడ్డల్ని అక్కున చేర్చుకోవాల్సిన చట్ట చౌకీదారు నేరస్తులకు సానుభూతి చూపింది. కానీ, మెలకువలో ఉన్న మహిళా ఉద్యమం ఎటువంటి ‘పెడ’ ధోరణుల్ని సహించనని నిర్ద్వంద్వంగా స్పందించింది. ఈ ఏడాది ఉద్యమకాలం, ఈ మార్చి 8 మహిళా నాయకత్వ విజయం. రైతులు, కార్మికులు, విద్యార్థినులు, మేధావులు అందరూ ఉద్యమకారులుగా బరిలో నిలిచిన సందర్భం. భయాన్ని కోల్పోయేంతగా భయపెడితే మీకు వణుకుపుట్టిస్తాం అని నిర్బంధాలకూ, విద్వేషాలకూ మహిళలు ఐక్యంగా తెగేసి చెప్పిన ఏడాదికి జేజేలు. 


– దేవి, సాంస్కృతిక కార్యకర్త

మరిన్ని వార్తలు