ఉద్యమం ఉధృతం వెనుక కారణాలు.. డిమాండ్లు

10 Dec, 2020 10:32 IST|Sakshi

ఢిల్లీ : నూతన వ్యవసాయచట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేస్తున్న ఆందోళన మరింత ఉదృతంగా మారింది. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని రైతులు తేల్చి చెబుతున్నారు. వ్యవసాయ చట్టాల రద్దు సహా పలు డిమాండ్లతో రెండు వారాలుగా వేలాదిగా రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఆరోవిడత చర్చలకు ముందు రైతుల డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం బుధవారం ఉదయం రైతు సంఘాలకు కొన్ని ప్రతిపాదనలను పంపించింది. వ్యవసాయ చట్టాల రద్దు కుదరదని అందులో స్పష్టం చేసింది. ప్రతిగా, రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కొన్ని సవరణలకు సిద్ధమని పేర్కొంది. అయితే రైతులు మాత్రం వ్యవసాయ చట్టాల రద్దు మాత్రమే తమ ఏకైక డిమాండ్‌ అని కేంద్రానికి తేల్చి చెప్పారు. రైతుల ఆందోళన ఇంత ఉదృతం చేయడానికి కారణాలు.. వారు చేస్తున్న డిమాండ్లు, అభ్యంతరాలు.. ప్రభుత్వం చెబుతున్న  సమాధానాలు ఏంటనేవి ఒకసారి పరిశీలిద్దాం.

నూతన వ్యవసాయ చట్టాలు 
రైతుల డిమాండ్ ‌: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. 
ప్రభుత్వ ప్రతిపాదన: రైతులకు చట్టంలో ఉన్న అభ్యంతరాలపై చర్చించడానికి, పరిగణనలోకి తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

పంటల వ్యాపారం
రైతుల సమస్య: ప్రభుత్వ సంస్థకు వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే వెసులుబాటు ముగుస్తుంది. పంటల కొనుగోలు పూర్తిగా ప్రైవేటు చేతుల్లోకి వెళ్తుంది. 
ప్రభుత్వ సమాధానం: కొత్త చట్టాల్లో ప్రభుత్వ సేకరణ వ్యవస్థలో జోక్యం చేసుకునే ప్రతిపాదన లేదు. ఎంఎస్పీ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలవు. అక్కడ మండీలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఉంది.  
ప్రభుత్వ ప్రతిపాదన: ఎమ్మెస్పీ వ్యవస్థ కూడా క్రమంగా బలపడుతుంది. ఎమ్మెస్పీపై కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇస్తుంది. 

రైతుల భూమి ఆక్రమణ
రైతుల సమస్య: రైతుల భూమిని పెద్ద పారిశ్రామికవేత్తలు ఆక్రమించుకుంటారు. రైతు తన భూమిని కోల్పోతాడు. 
ప్రభుత్వ సమాధానం: వ్యవసాయ ఒప్పంద చట్టం ప్రకారం, వ్యవసాయ భూముల అమ్మకం, లీజు మరియు తనఖాపై ఎటువంటి ఒప్పందం ఉండకూడదు. రైతు భూమిలో ఏదైనా నిర్మాణం జరిగితే, ఒప్పందం ముగిసిన తర్వాత పంట కొనుగోలుదారు దానిని తీసివేయాలి. నిర్మాణం తొలగించకపోతే, అది రైతు సొంతం అవుతుంది. 
ప్రభుత్వ ప్రతిపాదన: రైతు భూమిపై ఒక నిర్మాణ చేపట్టే సందర్భంలో, పంట కొనేవారు దానిపై రుణం తీసుకోలేడు, నిర్మాణాన్ని తన ఆధీనంలో ఉంచుకోలేడు.

వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు 
రైతుల సమస్య: ఏపీఎంసీ మండీలు బలహీనపడ్తాయి. దాంతో, రైతు ప్రైవేటు మండీల బారిన పడే అవకాశం ఉంది. 
ప్రభుత్వ సమాధానం: మండీలు కాకుండా, రైతులు తమ పంటలను కోల్డ్‌ స్టోరేజ్‌ నుంచి, నేరుగా తమ పొలాల నుంచి లేదా కర్మాగారాల్లో కూడా విక్రయించడానికి చట్టాల్లో వీలు కల్పించాము. రైతుల ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, ఎమ్మెస్పీ విధానం గతంలో మాదిరిగానే ఉంటుంది. 
ప్రభుత్వ ప్రతిపాదన: రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్‌ మండీలను నమోదు చేసే విధంగా చట్టాన్ని మార్చవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటువంటి మండీల నుంచి సెస్‌ తిరిగి పొందగలవు.  

రైతుల భూమి స్వాధీనం 
రైతుల సమస్య: ఈ చట్టం రైతుల భూమిని అటాచ్‌ చేయిస్తుంది.
ప్రభుత్వ సమాధానం: రికవరీ కోసం రైతు భూమిని అటాచ్‌ చేయడం కుదరదని కొత్త చట్టంలోని సెక్షన్‌ 15లో స్పష్టంగా ఉంది. నిబంధనలను ఉల్లంఘిస్తే.. కొనుగోలుదారుకు 150% జరిమానా విధించవచ్చు. కాని రైతులకు జరిమానా విధించే నిబంధన చట్టంలో లేదు. 
ప్రభుత్వ ప్రతిపాదన: అవసరమైతే ఈ విషయంలో మరింత స్పష్టత ఇస్తాం.

కోర్టులో వివాదాల పరిష్కారం 
రైతుల సమస్య: వివాదం ఉంటే, రైతులు సివిల్‌ కోర్టుకు వెళ్లలేరని కొత్త చట్టం చెబుతోంది. 
ప్రభుత్వ సమాధానం: 30 రోజుల్లో సమస్యను పరిష్కరించడానికి ఒక నిబంధన ఉంది. సయోధ్య చేసేందుకు ఒక బోర్డు ద్వారా పరస్పర ఒప్పందం కుదిరేలా ఏర్పాటు జరిగింది.  
ప్రభుత్వ ప్రతిపాదన: సివిల్‌ కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఇవ్వవచ్చు. 

పాన్‌ కార్డ్‌తో పంటను కొనడం 
రైతుల సమస్య: రిజిస్ట్రేషన్‌కు బదులు గా పాన్‌ కార్డు చూపించి పంటను కొనుగోలు చేస్తే, మోసం కూడా జరుగుతుంది. 
ప్రభుత్వ సమాధానం: మరిన్ని మార్కెటిం గ్‌ అవకాశాలను అందించడానికి పాన్‌ కార్డ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టారు. 
ప్రభుత్వ ప్రతిపాదన: పంటలు కొనేవారికి రిజిస్ట్రేషన్‌ నిబంధనలు రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వవచ్చు.

రిజిస్ట్రేషన్‌ 
రైతుల సమస్య: సాగు ఒప్పందాన్ని రిజిస్ట్రేషన్‌ చేసే విధానం లేదు. 
ప్రభుత్వ సమాధానం: కొత్త చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్‌ వ్యవస్థను ప్రారంభించవచ్చు. వారు రిజిస్ట్రేషన్‌ ట్రిబ్యునళ్లను కూడా ఏర్పాటు చేయవచ్చు. 
ప్రభుత్వ ప్రతిపాదన: రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసేవరకు, వ్యవసాయ ఒప్పందం తర్వాత 30 రోజుల్లోగా దాని కాపీని ఎస్‌డీఎం కార్యాలయంలో సమర్పించవచ్చు.  

పంట వ్యర్థాలను తగలబెట్టడంపై శిక్ష 
రైతుల సమస్య: ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ ఎన్‌సీఆర్‌ ఆర్డినెన్స్‌ 2020ను రద్దు చేయాలి. దీనివల్ల పంట వ్యర్థాలను తగలబెట్టినందుకు శిక్ష ఉంటుంది. 
ప్రభుత్వ ప్రతిపాదన: రైతుల అభ్యంతరాలను దూరం చేస్తాం.

విద్యుత్‌ బిల్లు 
రైతులు: విద్యుత్‌ సవరణ బిల్లు రద్దు చేయాలి. 
ప్రభుత్వ సమాధానం: ఈ బిల్లు చర్చలో ఉంది. సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఖాతాలో వేయాలనే  ప్రతిపాదన ఉంది. 
ప్రభుత్వ ప్రతిపాదన: విద్యుత్‌ బిల్లు చెల్లించే విధానంలో ఎటువంటి మార్పు ఉండదు. 

మరిన్ని వార్తలు