ఇరాక్‌లో ఘోరం: అగ్నిప్రమాదంలో 92 మంది బుగ్గి

14 Jul, 2021 03:42 IST|Sakshi
ప్రమాద స్థలంలో సిబ్బంది సహాయక చర్యలు

92 మంది మృతి

100 మందికి పైగా గాయాలు

బాగ్దాద్‌: ఇరాక్‌లోని నసిరియా నగరంలోని కోవిడ్‌ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 92 మంది మరణించారు. మరో 100 మందికి పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. అల్‌ హుస్సేన్‌ టీచింగ్‌ ఆసుపత్రిలోని కోవిడ్‌ వార్డులో సోమవారం రాత్రి అగ్ని కీలలు చెలరేగడంతో రోగులు మంటల్లో చిక్కుకొని ఎటూ వెళ్లే వీల్లేక ప్రాణాలు కోల్పోయారు. అగి్నమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పడానికి రాత్రంతా శ్రమించారు. మంగళవారం ఉదయం చూసేసరికి కాలిన మృత దేహాలు, దట్టమైన పొగ, ఎటు చూసినా రోగులు, బంధువుల రోదనలే కనిపించాయి.

తమ వాళ్లు ఎలా ఉన్నారో తెలీక బంధువులు ఏడుస్తూ కలియతిరగడం కనిపించింది. ప్రభుత్వ నిర్లక్ష్య పూరిత వైఖరి కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ విఫలమవడంతో సామాన్యులు మూల్యం చెల్లించాల్సి వస్తోందని విమర్శించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియలేదు. కొందరు అధికారులు ఎలక్ట్రిక్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగిందని చెబితే, మరికొందరు ఆక్సిజన్‌ సిలండర్‌ పేలడంతో ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఈ ఆస్పత్రిలో కరోనా వార్డుని 70 పడకలతో మూడు నెలల క్రితమే ప్రారంభించారు. గత ఏప్రిల్‌లో బాగ్గాద్‌లోని ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 82 మంది మరణించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు