రైలు ప్రయాణికులకు శుభవార్త

16 Nov, 2022 09:18 IST|Sakshi

రైలు ప్రయాణంలో తమకు కావాల్సిన ఫుడ్‌ విషయంలో చాలా మంది అసంతృప్తి చెందుతుంటారు. ప్రాంతాలు మారుతున్న క్రమంలో సరైన ఆహారం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాగా, ఇలాంటి విషయాలపై భారత రైల్వే బోర్డు.. ప్రయాణికులకు గుడ్ న్యూస్‌ చెప్పింది. రైళ్లలో ప్రయాణికులకు స్థానిక ఆహార పదార్థాలు అందించేలా బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇండియన్‌ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ)కి రైల్వే బోర్డు అనుమతి మంజూరు చేసింది.

ఇందులో భాగంగానే.. రైళ్లలో ప్రయాణికులకు ఇకపై స్థానిక, ప్రాంతీయ ఆహారం కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులకు, చిన్నారులకు, ఆరోగ్యపరంగా ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి తగిన ఆహారం అందజేయాలని సూచించింది. తృణధాన్యాలతో తయారు చేసిన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. రైళ్లలో కేటరింగ్‌ సేవలను మరింత మెరుగుపర్చడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేబోర్డు తెలియజేసింది. 

అలాగే.. శిశువులు, ఫుడ్‌ విషయాల్లో కేర్‌ తీసుకునే వారి కోసం ప్రత్యేక ఆహారాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు మెనూలో మార్పులు చేయాలని ఐఆర్‌సీటీసీకి రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. కాగా, రైళ్లలో ప్రయాణించే వారికి ప్రాంతీయ వంటకాలను అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. కాగా, పండుగల వేళల్లో సైతం ప్రత్యేక వంటకాలను సైతం విక్రయించుకోవచ్చని ఐఆర్‌సీటీసీకి బోర్డు తెలిపింది. శిశువులకు ఉపయోగపడే ఆహారంతో పాటు వివిధ వయస్సుల వారికి వారు మెచ్చే విధంగా ఫుడ్‌ను తయారు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

అయితే, ముందుగా నోటిఫై చేసిన ధరల ప్రకారమే ప్రీపెయిడ్‌ రైళ్లలో మెనూను ఐఆర్‌సీటీసీ నిర్ణయిస్తుందని రైల్వే బోర్డు వివరణ ఇచ్చింది. భోజనంలో కాకుండా.. ప్రత్యేకంగా ఆర్డర్‌ చేసే ఆహారాలు ఎంఆర్‌పీ ధరకు విక్రయించేందుకు అనుమితిస్తున్నట్టు తెలిపింది. ఎక్స్‌ప్రెస్‌, ఇతర రైళ్లలో మెనూలో ఉండే బడ్జెట్‌ ఆహార పదార్థాల ధరలను సైతం ఐఆర్‌సీటీసీ నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు