కప్పు ఛాయ్‌ రూ. 70 వసూలు! రైల్వే ప్యాసింజర్‌ షాక్‌.. రైల్వేస్‌ వివరణ

1 Jul, 2022 08:00 IST|Sakshi

వైరల్‌: రైలు ప్రయాణాల్లో దొరికే ఫుడ్‌, డ్రింక్స్‌ మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది?. ఎన్నో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా.. స్పందన అరకొరగానే ఉంటోంది భారతీయ రైల్వేస్‌ నుంచి. ఆ సంగతి పక్కనపెడితే.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ ఫొటో మాత్రం చాలామందికి ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేవలం సింగిల్‌ ఛాయ్‌కు 70 రూపాయలు ఓ ప్రయాణికుడి నుంచి వసూలు చేసింది ఐఆర్‌సీటీసీ . ఈ విషయంపై నిలదీస్తూ సోషల్‌ మీడియాలో అతను పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అవుతోంది. 

ఢిల్లీ నుంచి భోపాల్‌ మధ్య ప్రయాణించే భోపాల్‌ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో జూన్‌ 28న సదరు వ్యక్తి ప్రయాణించాడు. ఉదయం టీ కోసం 20 రూ. చార్జ్‌ చేసింది ఐఆర్‌సీటీసీ. అయితే.. సర్వీస్‌ ఛార్జ్‌ పేరిట ఏకంగా 50రూ. తీసుకుంది. దీంతో ఇది మోసమంటూ.. జీఎస్టీ బాదుడంటూ సదరు వ్యక్తి సోషల్‌ మీడియాలో ఆ బిల్లును పోస్ట్‌ చేశారు. 

అయితే అది జీఎస్టీ కాదని.. కేవలం సర్వీస్‌ ఛార్జ్‌ మాత్రమే అని అతనికి కొందరు క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ 50రూ. టూమచ్‌ అని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఐఆర్‌సీటీసీ స్పందించింది. నిబంధనల మేరకే వ్యవహరించామని, ఆ ప్రయాణికుడి నుంచి ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయలేదని తెలిపింది. ఈ మేరకు 2018లో రిలీజ్‌ అయిన ఓ సర్క్యులర్‌ను చూపిస్తోంది. సదరు సర్క్యులర్‌ ప్రకారం.. 

రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి రైళ్లలో రిజర్వేషన్‌ చేసుకున్నప్పుడు వాళ్లు గనుక ఫుడ్‌ బుక్‌ చేసుకోని సందర్భాల్లో..  టీ, కాఫీ, ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే అదనంగా యాభై రూపాయలు సర్వీస్‌ ఛార్జ్‌ కింద వసూలు చేస్తారు. అది సింగిల్‌ ఛాయ్‌ అయినా సరే.. ఇదే నిబంధన వర్తిస్తుంది. గతంలో రాజధాని, శతాబ్ది రైళ్లలో టికెట్‌తో పాటు ఫుడ్‌ సర్వీస్‌ తప్పనిసరిగా ఉండేది. తర్వాత దానిని సవరించి.. ఆప్షనల్‌ చేసింది ఇండియన్‌ రైల్వేస్‌. అప్పటి నుంచి ఇలా బాదుడు షురూ చేసింది.

మరిన్ని వార్తలు