ప్రవక్తపై వ్యాఖ్యలు: భారత్‌లో ఆత్మాహుతి బాంబు దాడుల వార్నింగ్‌

15 Jun, 2022 14:39 IST|Sakshi

మహమ్మద్ ప్రవక్తపై మాజీ బీజేపీ నేతలు నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌.. చేసిన వ్యాఖ‍్యల వేడి ఇంకా చల్చారలేదు. వారి వ్యాఖ్యల కారణంగా దేశంలో ఇంకా పలు చోట్ల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంపై నూపుర్‌ శర్మను హెచ్చరిస్తూ ఉగ్రవాద సంస్థలు ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. 

తాజాగా నూపర్‌ శర్మ వ్యాఖ‍్యలకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఐసీస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. భారత్ అంతటా దాడులు చేస్తామంటూ ఐసీస్‌ ఖొరాసాన్‌ హెచ్చరించారు. ఇక గత వారం.. మహమ్మద్ ప్రవక్తను అవమానించినందుకు ప్రతీకారంగా భారత్‌లోని వివిధ నగరాల్లో ఆత్మాహుతి బాంబు దాడులు జరుపుతామంటూ వార్నింగ్‌ ఇస్తూ అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AQIS) ఒక లేఖను జారీ చేసిన విషయం తెలిసిందే.

అంతకు ముందు కూడా ఉగ్ర సంస్థ ఎంజీహెచ్‌ నూపుర్‌ శర్మకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల చేసినందుకుగానూ బేషరతుగా ప్రపంచానికి క్షమాపణ చెప్పాలని ఒక బెదిరింపు ప్రకటన విడుదల చేసింది. ‘‘నూపుర్‌ శర్మ తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. మొత్తం ప్రపంచానికి క్షమాపణలు చెప్పాలి. లేకుంటే.. ప్రవక్తను అగౌరవపరిచినందుకు ఏం చేయాలో అది చేస్తాం’’ అంటూ  టెలిగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్‌లో క్రియాశీలకంగా వ్యవహరించే ఈ ఉగ్రసంస్థ.. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ ఘాజీపూర్‌ పూల మార్కెట్‌లో ఐఈడీ పేలుడుకు పాల్పడింది.

ఇది కూడా చదవండి: నేషనల్‌ హెరాల్డ్‌ కేసు: మూడో రోజు ఈడీ ముందుకు రాహుల్‌..

మరిన్ని వార్తలు