ఇస్రో ఎన్నటికీ ప్రైవేటుపరం కాదు: శివన్‌

20 Aug, 2020 22:33 IST|Sakshi

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రైవేటుపరం చేయనున్నారనే వార్తలను సంస్థ చైర్మన్‌ కె.శివన్‌ కొట్టిపారేశారు. ఇస్రో ప్రైవేటీకరణ ఎన్నటికీ జరగబోదని స్పష్టం చేశారు. అంతరిక్ష పరిశోధనా కార్యకలాపాల్లో అంకుర సంస్థలను (ప్రైవేటు సంస్థలు) భాగస్వామ్యం చేయడమే సంస్కరణల ఉద్దేశమని తెలిపారు. కాగా అంతరిక్ష పరిశోధనా రంగంలో సంస్కరణలు చేపట్టనున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ సెక్టార్‌లోకి ప్రైవేటు సంస్థలను అనుమతిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినేట్ జూన్‌లో నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇస్రోను ప్రైవేటికరించనున్నారనే కోణంలో అనేక సందేహాలు తలెత్తాయి. (అంతరిక్షంలోకి ‘ప్రైవేటు’ మంచిదే: శివన్)

ఈ విషయం గురించి గురువారం ఓ వెబినార్‌లో మాట్లాడిన ఇస్రో చైర్మన్‌ శివన్‌.. కేంద్రం తీసుకురానున్న సంస్కరణలు భారత అంతరిక్ష రంగంలో సరికొత్త మార్పులకు నాంది పలుకుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇస్రో కార్యకలాపాలు, పరిశోధనలు మరింతగా పెరుగుతున్నాయన్న ఆయన.. గతంలో కంటే మెరుగ్గా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని సంస్థ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఇస్రోను ప్రైవేటుపరం చేస్తారనేవి కేవలం అపోహలు మాత్రమేనని.. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు కూడా అంతరిక్ష కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా విధివిధానాలు ఉంటాయని స్పష్టం చేశారు. సంస్కరణల్లో భాగంగా.. ప్రైవేటు కంపెనీలు, భారత ప్రభుత్వ అంతరిక్ష సంబంధిత సాంకేతికత, ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ను వాడుకునేందుకు వీలుగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్(ఐఎన్–ఎస్ పీఏసీఈ) ఏర్పాటు జరుగనుందని తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు