మంగళ్‌యాన్‌ కథ ముగిసింది

4 Oct, 2022 05:58 IST|Sakshi

బెంగళూరు: అంగారక (మార్స్‌) గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన మంగళ్‌యాన్‌ మిషన్‌ ముగిసింది. మార్స్‌ ఆర్బిటార్‌ క్రాఫ్ట్‌తో గ్రౌండ్‌ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయినట్లు ఇస్రో సోమవారం ధ్రువీకరించింది. 2013 నవంబర్‌ 5న ఆర్బిటార్‌ ప్రయోగం ప్రారంభించారు. ఆర్బిటార్‌ 300 రోజులపాటు ప్రయాణించి 2014 సెప్టెంబర్‌ 24న అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించింది.

ఈ ఎనిమిదేళ్ల కాలంలో అరుణగ్రహం ఉపరితలంపై వాతావరణ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించింది. మంగళ్‌యాన్‌ జీవితకాలం ముగిసిందని, పని చేయడం ఆగిపోయిందని, ఆర్బిటార్‌ను ఇక రికవరీ చేయలేమని ఇస్రో అధికారులు స్పష్టం చేశారు. ఇతర గ్రహాలపై పరిశోధనల విషయంలో మంగళ్‌యాన్‌ అద్భుత సాంకేతిక, శాస్త్రీయ ప్రయోగంగా మిగిలిపోతుందని ఒక ప్రకటనలో వెల్లడించారు.

మరిన్ని వార్తలు