భూతలం.. మరింత స్పష్టం

11 Mar, 2021 05:10 IST|Sakshi

ఏపీ సెంట్రల్‌ డెస్క్‌: భూ ఉపరితల మార్పులను క్షుణ్ణంగా పరిశోధించే క్రమంలో ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) మరో ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా)తో కలసి సంయుక్తంగా రూపొందిస్తున్న ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ మిషన్‌ కోసం అత్యంత ఎక్కువ రిజల్యూషన్‌తో ఫొటోలు తీయడానికి ఉపకరించే సింథటిక్‌ అపెర్చ్యూర్‌ రాడార్‌ (సార్‌)ను ఇస్రో విజయవంతంగా అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన ఎస్‌ బ్యాండ్‌ పేలోడ్‌కు మార్చి 4న ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ వర్చువల్‌ విధానంలో పచ్చ జెండా ఊపారు. అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (ఎస్‌ఏసీ) నుంచి అమెరికాలోని పాసడేనాలో ఉన్న నాసా జెట్‌ ప్రొపల్షన్‌ లాబొరేటరీ (జేపీఎల్‌)కి దానిని పంపారు. అక్కడ రెండు బ్యాండ్‌లను అనుసంధానం చేస్తారని ఇస్రో వర్గాలు చెప్పాయి.

భూమిని మరింత నిశితంగా పరిశీలించడానికి నిసార్‌ (నాసా, ఇస్రో సార్‌) మిషన్‌ను నాసా, ఇస్రో సంయుక్తంగా ప్రయోగించనున్న విషయం తెలిసిందే. భూ ఉపరితలంపై సెంటీ మీటర్‌ వైశాల్యం కన్నా చిన్న ప్రాంతంలో కూడా సంభవించే మార్పులను గుర్తించడానికి రెండు వైవిధ్య భరిత ఫ్రీక్వెన్సీలు (ఎల్‌ బ్యాండ్, ఎస్‌ బ్యాండ్‌) ఉపయోగిస్తున్న మొట్టమొదటి శాటిలైట్‌ మిషన్‌ నిసార్‌ అని నాసా వర్గాలు పేర్కొన్నాయి. దీనిలో స్పేస్‌క్రాఫ్ట్‌ బస్, ఎస్‌ బ్యాండ్‌ రాడార్, ల్యాండ్‌ వెహికిల్, నిసార్‌ లాంచ్‌కు కావాల్సిన ఇతర సేవలను ఇస్రో అందిస్తుంది. ఎల్‌ బ్యాండ్‌ సార్, కమ్యూనికేషన్‌ కోసం సైన్స్‌ డేటా సబ్‌ సిస్టం, అత్యంత భద్రంగా ఉండే రికార్డర్, పేలోడ్‌ డేటా సబ్‌ సిస్టంలను నాసా సమకూరుస్తుంది.

శ్రీహరికోట నుంచి ప్రయోగం..
నిసార్‌ మిషన్‌ ప్రయోగానికి సంబంధించి 2014 సెప్టెంబర్‌ 30న ఇస్రో, నాసా మధ్య భాగస్వామ్య ఒప్పందం జరిగింది. దీనిని 2022 ప్రథమార్థంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. అడ్వాన్స్‌ రాడార్‌ ఫొటోల ద్వారా భూ ఉపరితలంపై జరుగుతున్న మార్పులు, తదనంతరం సంభవించబోయే పరిణామాలను లెక్కించడం ఇస్రో లక్ష్యం. మంచు కరిగిపోవడం నుంచి భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరిగిపడటాలు మొదలగు ఉపద్రవాలకు గల కారణాలు, ఆ ప్రాదేశిక ప్రాంతాల్లోని పర్యావరణ మార్పులకు సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని నిసార్‌ సమకూరుస్తుంది.

భూ ఉపరితలంపై వస్తున్న సున్నిత మార్పులు, మంచు పరిమాణం, జీవపదార్థాల సమాచారం, సహజ ప్రమాదాలు, సముద్ర మట్టం పెరిగిపోవడం, భూమిలో నీటిమట్టం తదితర వివరాలను నిసార్‌ మిషన్‌ అంచనా వేస్తుందని నాసా వర్గాలు పేర్కొన్నాయి. ఈ మిషన్‌ ప్రతి ఆరురోజులకు ఒక భూ ప్రదక్షిణ పూర్తి చేస్తుందని, ఆ సమయంలో భూమి, మంచు ఉపరితాలలో మార్పులను క్షుణ్ణంగా పరిశీస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. భూమిని కారు మబ్బులు కమ్మినా, చిమ్మచీకటి అలిమేసినా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమాచారాన్ని సేకరించి విశ్లేషించేలా నిసార్‌ను రూపొందిస్తున్నామని నాసా వెల్లడించింది. 

విపత్తులను ఎదుర్కోవడానికి ఎంతో అవసరం
ఈ మిషన్‌ పలు భ్రమణాలు పూర్తి చేసిన తర్వాత భూ ఉపరితలంపై మార్పులను, ప్రమాదాలను సులువుగా గుర్తించడానికి వీలవుతుంది. స్పష్టంగా ఉండే ఫొటోలతో ప్రాంతాల వారీగా వస్తున్నమార్పులను నిశితంగా పరిశీలించవచ్చు. భూ ఉపరితలంలో వస్తున్న మార్పులు, అనంతర పరిణామాలను కొన్నేళ్ల పాటు బాగా అర్థం చేసుకోవడానికి ఈ మిషన్‌ సమాచారం ఉపయోగపడుతుందని నాసా వర్గాలు తెలిపాయి. వనరులను సమర్థవంతగా వినియోగించుకుంటూ విపత్తులను ఎదుర్కోవడానికి, భూ ఉపరితల మార్పులను తట్టుకునేలా సిద్ధం కావడానికి ఇది ఎంతో అవసరమని చెప్పాయి. విశ్వవ్యాప్తంగా సైన్స్‌ కార్యక్రమాల కోసం ఎల్‌ బ్యాండ్‌ రాడార్‌ సేవలు కనీసం మూడేళ్లు అవసరమని, దక్షిణ మహాసముద్రం, భారత్‌లలో ప్రత్యేక లక్ష్యాల కోసం ఇస్రోకు ఎస్‌ బ్యాండ్‌ రాడార్‌ సేవలు కనీసం ఐదేళ్లు అవసరమని నాసా పేర్కొంది.  

మరిన్ని వార్తలు