పీఎస్‌ఎల్‌వీ సీ49 సూపర్‌ సక్సెస్‌

8 Nov, 2020 04:52 IST|Sakshi

కోవిడ్‌–19 నిబంధనలను అధిగమించి రాకెట్‌ ప్రయోగం

వేర్వేరు కక్ష్యల్లోకి పది ఉపగ్రహాలు

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ49 (పీఎస్‌ఎల్‌వీ–డీఎల్‌) ప్రయోగం విజయవంతమైంది. ముందుగా నిర్ణయించిన కాలం ప్రకారం మధ్యాహ్నం 3:02 గంటలకు ప్రయోగించాల్సి ఉండగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తొమ్మిది నిమిషాలు ఆలస్యంగా 3:11 గంటలకు ప్రయోగించారు.  

ఏకంగా 10 ఉపగ్రహాలు
ఈ ప్రయోగం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు 630 కిలోల బరువు కలిగిన పది ఉపగ్రహాలను 575 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్త ధ్రువకక్ష్యలోకి (సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌) విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం ద్వారా దేశీయ అవసరాల నిమిత్తం రూపొందించిన రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (ఈఓఎస్‌–01) అనే ఉపగ్రహంతో పాటు లిథువేనియాకు చెందిన ఆర్‌–2, లక్జెంబర్గ్‌కు చెందిన కేఎస్‌ఎం–1ఏ, కేఎస్‌ఎం–1బీ, కేఎస్‌ఎం–1సీ, కేఎస్‌ఎం–1డీ, అమెరికాకు చెందిన లిమూర్‌ అనే ఉపగ్రహాల శ్రేణిలో నాలుగు ఉపగ్రహాలను నిరీ్ణత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.  ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (ఈఓఎస్‌–01) ఉపగ్రహాన్ని మన దేశ అవసరాల కోసం రూపొందించారు. ఇది రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహమే అయినప్పటికీ, ఇందులో ఉన్న శక్తిమంతమైన కెమెరాలు రైతులకు ఉపయోగపడేలా, వ్యవసాయానికి సంబంధించిన పలు విషయాల పూర్తిస్థాయి సమాచారాన్ని అందిస్తుంది.

అద్భుతమైన ప్రయోగం: ఇస్రో చైర్మన్‌  
ఇదొక అద్భుతమైన ప్రయోగమని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ శివన్‌ అన్నారు. 10 ఉపగ్రహాలను ముందుగా అనుకున్న ప్రకారమే విజయవంతంగా ప్రయోగించామని తెలిపారు. ఈఓఎస్‌–01 కక్ష్యలోకి ప్రవేశించిన కొద్ది సేపటికే సోలార్‌ ప్యానల్స్‌ కూడా విజయవంతంగా విచ్చుకున్నామని తెలిపారు.  కోవిడ్‌–19 పరిస్థితులను అ«ధిగమించి విజయం సాధించామన్నారు. రాకెట్‌ అనుసంధానం చేసేటపుడు కభౌతిక దూరాన్ని పాటించినట్లు చెప్పారు.  

అభినందనల వెల్లువ
పీఎస్‌ఎల్‌వీ–సీ49 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు, ప్రయోగంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని ప్రధాని మోదీ అభినందించారు. 10 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పంపేందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలను ఏపీ గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరి చందన్‌ అభినందించారు. ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. దేశంలో వ్యవసాయం, అటవీ, విపత్తుల నిర్వహణకు ఈఓఎస్‌–01 ఉపగ్రహం ఎంతో తోడ్పడుతుందని గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా