ఇస్రో సూపర్‌ సక్సెస్‌

1 Mar, 2021 02:01 IST|Sakshi

విజయవంతంగా పీఎస్‌ఎల్‌వీ సీ51 

బ్రెజిల్‌ ‘అమెజానియా’ సహా 19 ఉపగ్రహాలు కక్ష్యలోకి..

ప్రధాని మోదీ అభినందనలు

శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీస్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ51 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది. ఈ ఏడాది మొట్టమొదటగా ఆదివారం ఉదయం 10.24 గంటలకు ప్రయోగించిన రాకెట్‌ విజయంతో శుభారంభమైంది. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 53వ ప్రయోగంతో షార్‌ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన 78వ ప్రయోగం ఇది. 44.4 మీటర్ల పొడవైన పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌కు సంబంధించి శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. 25.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నిప్పులు చిమ్ముతూ నింగి వైపు దూసుకెళ్లింది. 1.38 గంటల వ్యవధిలో 19 ఉపగ్రహాలను భూమికి 537 నుంచి 637 కిలో మీటర్లు పరిధిలోని వివిధ సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశ పెట్టింది.

ఇటీవల ఏర్పాటైన ఇస్రో అనుబంధ న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ వాణిజ్యపరంగా చేపట్టిన ఈ మొట్టమొదటి మిషన్‌లో బ్రెజిల్‌కు చెందిన అమెజానియా–01 ఉపగ్రహం ప్రధానమైంది. 637 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని 17.23 నిమిషాల్లో సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌లో నాలుగో దశలో అమెరికాకు చెందిన స్పేస్‌బీస్‌ ఉపగ్రహాల శ్రేణిలో 12 చిన్న తరహా ఉపగ్రహాలు, సాయ్‌–1 కాంటాక్ట్‌–2 అనే మరో ఉపగ్రహంతో కలిపి 13 ఉపగ్రహాల శ్రేణిని ఒకసారి, తమిళనాడు కోయంబత్తూరులోని శ్రీశక్తి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు తయారు చేసిన శ్రీ శక్తిశాట్, శ్రీపెరంబుదూర్‌లోని జెప్పియర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు తయారు చేసిన జిట్‌శాట్, మహారాష్ట్ర నాగపూర్‌లోని జీహెచ్‌ రాయ్‌సోనీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు తయారు చేసిన జీహెచ్‌ఆర్‌సీ ఈశాట్‌ మూడు ఉపగ్రహాలను యూనిటిశాట్స్‌ను, న్యూ స్పేస్‌ ఇండియాలో భాగంగా భారత ప్రైవేట్‌ సంస్థలు రూపొందించిన సింధునేత్ర, సతీష్‌ ధవన్‌ శాట్‌లను కలిపి మరో శ్రేణిగా చేర్చి రోదసీలోకి విజయవంతంగా ప్రవేశ పెట్టడంతో ప్రయోగం పూర్తయింది. ఈ మిషన్‌తో ఇస్రో ఇప్పటి వరకు 34 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించినట్లయింది.  

14 మిషన్ల ప్రయోగమే లక్ష్యం: డాక్టర్‌ కె.శివన్,
ఈ ఏడాదిలో 14 మిషన్లు ప్రయోగించాలనే లక్ష్యంతో పని చేయాలని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజినీర్లకు పిలుపునిచ్చారు.  పీఎస్‌ఎల్‌వీ సీ51 ప్రయోగం విజయవంతమైన అనంతరం శివన్‌ షార్‌లోని మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి మాట్లాడుతూ 14 మిషన్ల ప్రయోగంలో భాగంగా 7 లాంచింగ్‌ వెహికల్స్, ఆరు ఉపగ్రహాలు, ఒక మానవరహిత ప్రయోగానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. 2020లో కోవిడ్‌–19 వల్ల ప్రయోగాల విషయంలో వెనుకబడ్డామని, ఇకపై వేగం పెంచుతామని తెలిపారు. బ్రెజిల్‌కు చెందిన అమెజానియా–01ను ఇక్కడ నుంచి ప్రయోగించడం సంతోషంగా ఉందన్నారు. అనుకున్న ప్రకారం 17.23 నిమిషాలకు అమెజానియా–01 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన కొద్ది నిమిషాలకు సోలార్‌ ప్యానెల్స్‌ పనిచేయడం ప్రారంభించాయని చెప్పారు. పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌ ద్వారా అమెజానియా–01 ఉపగ్రహం సక్సెస్‌ పుల్‌గా కక్ష్యలోకి చేరుకున్నందుకు సంతోషంగా ఉందని బ్రెజిల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి మార్కోస్‌ కెసార్‌ పొంటీస్‌ అన్నారు. ప్రయోగం విజయం అనంతరం ఆయన మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి మాట్లాడుతూ పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌ అమోఘం అని, ఈ రాకెట్‌ తయారు చేసిన టీంను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.  భారత్‌లో ప్రైవేట్‌ సంస్థలకు ఆహ్వానం పలికేందుకు న్యూ స్పేస్‌ ఇండియాను ఏర్పాటు చేశామని సీఎండీ నారాయణన్‌ తెలిపారు. భారత్‌లో ప్రైవేట్‌ సంస్థలకు చెందిన వారు ఉప గ్రహాలను తయారు చేసుకుంటే వాటిని ఇస్రో ప్రయోగించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.

ప్రముఖుల అభినందనలు
వాణిజ్యపరంగా మొట్టమొదటిసారిగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైనందుకు ప్రధాని మోదీ శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు తెలిపారు. దేశం చేపట్టిన సంస్కరణలు అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త శకానికి నాందిపలికాయన్నారు. అమెజానియా ప్రయోగం విజయవంతం కావడంపై బ్రెజిల్‌ అధ్యక్షుడు బొల్సనారోకు ప్రధాని అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో రెండు దేశాల మధ్య సహకారానికి నాందికానుందన్నారు.  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

ఇస్రోకు ఏపీ గవర్నర్‌ అభినందనలు  
సాక్షి, అమరావతి: పీఎస్‌ఎల్వీ సి–51 రాకెట్‌ ప్రయోగం విజయవంతంకావడంపట్ల గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.  

ఏపీ ముఖ్యమంత్రి అభినందనలు
పీఎస్‌ఎల్వీ –సీ 51 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను ఏపీ  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఇస్రో భవిష్యత్‌లో చేపట్టే అన్ని ప్రయోగాల్లోనూ విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు