Isudan Gadhvi: గుజరాత్‌లో ఆప్‌ సీఎం అభ్యర్థిగా ఇసుదన్‌ గాధ్వి.. మాములు వ్యక్తి కాదుగా.. 

4 Nov, 2022 15:24 IST|Sakshi

Isudan Gadhvi.. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గుజరాత్‌లో గెలుపు కోసం అధికార పార్టీ సహా, ప్రతిపక్ష పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. కాగా, ఈసారి జరగబోయే ఎన్నికల్లో తమ గెలుపు తథ్యమంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 

అయితే, గుజరాత్‌లో ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్‌ కాకముందు నుంచే ఢిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌.. రాష్ట్రంలో పలుమార్లు పర్యటించారు. ఆప్‌ను గెలిపించాలంటూ గుజరాతీలకు భారీ ఆఫర్లు సైతం ప్రకటించారు. కాగా, తాజాగా ఆప్‌.. తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఆప్‌ జాతీయ కార్యదర్శి ఇసుదన్‌ గాధ్విని గుజరాత్‌ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్లు కేజ్రీవాల్‌ ప్రకటించారు. కాగా, పంజాబ్‌ తరహాలోనే పోల్‌ నిర్వహించి సీఎం అభ్యర్థిని కేజ్రీవాల్‌ ప్రకటించడం విశేషం. 

ఈ సందర్భంగా ఇసుదన్‌ గాధ్వి మాట్లాడుతూ.. “నాపై విశ్వాసంతో నాలాంటి సామాన్యుడికి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి, అరవింద్ కేజ్రీవాల్‌కి ముఖ్యంగా గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు. నేను ఎల్లప్పుడూ ప్రజలకు సేవకుడిగానే ఉంటాను. ప్రజా ప్రయోజనాల కోసం పని చేస్తానని వాగ్దానం చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

ఇక, సీఎం అభ్యర్థి గాధ్వి.. జర్నలిస్టుగా పనిచేశారు. మొదట దూరదర్శన్‌లో పనిచేశారు. తర్వాత జర్నలిస్టుగా తన కెరీర్‌లో, గుజరాత్‌లోని డాంగ్ జిల్లాలో 150 కోట్ల అటవీ నిర్మూలన కుంభకోణాన్ని బయటపెట్టాడు. ఈ క్రమంలో అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాడు. కాగా, 2021లో ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. మరోవైపు.. గుజ‌రాత్‌లో రెండు ద‌శ‌ల్లో గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబ‌ర్ ఒక‌టో తేదీన తొలి ద‌ఫా, ఐదో తేదీన రెండో ద‌ఫా ఎన్నిక‌లను నిర్వహించ‌నున్నారు. డిసెంబ‌ర్ 8వ తేదీన ఫ‌లితాల‌ను వెల్లడించ‌నున్నట్లు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. 182 అసెంబ్లీ స్థానాలకు గానూ.. తొలి విడుత‌లో 89 స్థానాల‌కు, రెండ‌వ విడుత‌లో 93 స్థానాల‌కు పోలింగ్ జ‌రుగనుంది. 

మరిన్ని వార్తలు