రైతు ఇంట్లో ఐటీ దాడులు.. రెండేళ్లలో అపార సంపద

29 Nov, 2020 07:49 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఆర్థికంగా చతికిల బడ్డ ఓ మోతుబారి రైతుకు రెండేళ్లల్లో అపార సంపద వచ్చి చేరడం ఆదాయ పన్ను శాఖ పరిశీలనలో తేలింది. దీంతో ఆ రైతు ఇంటిపై ఐటీ వర్గాలు దాడుల్లో నిమగ్నమయ్యాయి. కడలూరు జిల్లా బన్రూటి సమీపంలోని ముత్తుకృష్ణాపురం గ్రామానికి చెందిన సుగీష్‌ చంద్రన్‌ మోతుబారి రైతు. ఒకప్పుడు వీరికి పంట పొలాలు ఎక్కువే. అయితే క్రమంగా ఆస్తులు కరిగిపోయాయి. కొన్నేళ్లు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోవాల్సిన పరిస్థితి.   (దేవుడే దిక్కు.. నిత్యపూజలు, ప్రార్థనలు)

అయితే రెండేళ్లలో వీరి సంపద అమాంతంగా పెరగడం ఐటీ పరిశీలనలో తేలింది. పోగొట్టుకున్న స్థలాల్ని మళ్లీ కొనడం, కొత్తగా స్థలాల కొనుగోలు అంటూ ఈ రైతు ఆర్థిక పరిస్థితి ఎవ్వరూ ఊహించని రీతిలో పెరిగింది. వీటి వెనుక చెన్నైలోని ఓ సంస్థలో పనిచేస్తున్న ఆయన కుమారుడు, ముంబైలో మరో సంస్థలో పనిచేస్తున్న కుమార్తె, అల్లుడు హస్తం ఉన్నట్టు ఐటీ విచారణలో తేలినట్టుంది. కరోనా లాక్‌కు ముందుగా ఆ గ్రామంలో రాధాకృష్ణన్‌ అనే వ్యక్తికి చెందిన పురాతన బంగళాను సైతం వీరు కొనుగోలు చేశారు. దీంతో వారం రోజులుగా ఐటీ వర్గాలు ఈ  రైతు కుటుంబంపై దృష్టి పెట్టారు.

ఈ పరిస్థితుల్లో  శుక్రవారం రాత్రి ఐటీ వర్గాలు ఆ ఇంటిపై దాడులు చేశారు. ఈ దాడులు శనివారం కూడా కొనసాగడం గమనార్హం. పదుల సంఖ్యలో వాహనాల్లో ఐటీ వర్గాలు వచ్చి సోదాల్లో నిమగ్నం కావడం చూస్తే, మోతుబారి రైతు కుటుంబనాకి అపార సంపద హఠాత్తుగా ఎలా వచ్చిందో గుట్టు రట్టు చేసే వరకు వదలి పెట్టేలా లేదు. చెన్నైలోని ఆ రైతు కుమారుడు, కోడలు, ముంబైలోని కుమార్తె, అల్లుడ్ని టార్గెట్‌ చేసి ఐటీ వర్గాలు దర్యాప్తు, తనిఖీల వేగం పెరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.   చదవండి: (మళ్లీ గండం.. బంగాళాఖాతంలో ద్రోణి..)

మరిన్ని వార్తలు