బంగారు దోసె @ రూ.వెయ్యి

12 Nov, 2022 09:01 IST|Sakshi
ప్లేటులో బంగారు దోసె తినాలంటే చాలా ఖర్చవతుంది మరీ!

తుమకూరు: సెట్‌ దోసె, నీరు దోసె, మసాల దోసె, ప్లెయిన్‌ దోసె ఇలా అనేక రకాల దోసెలను తినే ఉంటారు. వాటి ధర  50 నుంచి 100 మధ్య ఉంటే గొప్ప. కానీ ఇక్కడ ఎవరూ ఊహించని దోసెను అమ్ముతున్నారు. దానిని ఆరగించాలంటే రూ. వెయ్యి చెల్లించుకోవాలి. దోసెకు అంత ధర అని ఆశ్చర్యపోవద్దు, వివరాలు తెలుసుకుంటే నిజమే అని అంగీకరిస్తారేమో.  

ఇలా తయారవుతుంది   
తుమకూరు నగరంలో రైల్వేస్టేషన్‌ రోడ్డులోని ఓ హోటల్లో బంగారు దోసె లభిస్తోంది. మామూలు మసాలా దోసెను చేయగానే దానిపై అతి పల్చని బంగారు కాగితాన్ని పరుస్తారు. దోసె వేడికి అది అలాగే అతుక్కుపోతుంది. దోసెతో సహా బంగారాన్ని కూడా తినేయవచ్చు. గత మూడు నెలల నుంచి ఇక్కడ బంగారు దోసెలను అమ్ముతున్నారు.  

ఇప్పటికి 45 దోసెలు మాత్రమే  
హోటల్‌ యజమాని కార్తీక్‌ మాట్లాడుతు కొన్ని సంవత్సరాల కిందట బెంగళూరులో ఒక హోటల్లో ఇలాంటి దోసెను వేశారని, అది మనసులో పెట్టుకుని తాను కూడా బంగారు దోసెకి నాంది పలికినట్లు చెప్పాడు. అప్పటి నుంచి రూ. వెయ్యి చెల్లించి 45 మంది మాత్రం ఈ ఖరీదైన దోసెల సంగతి చూశారు. కాగా, బంగారాన్ని ఆరగించడం ఆరోగ్యానికి మంచిదని కొందరు, ఎలాంటి ఉపయోగం ఉండదని మరికొందరు తెలిపారు. ఎక్కువమంది కొనకపోయినప్పటికీ ఈ హోటల్‌కు వచ్చి బంగారు దోసెను చూసి ఫోటోలు వీడియోలు తీసుకోవడం పెరిగింది.   

(చదవండి: సాగర జలాశయంలో వింత మత్స్యం  ..రెక్కలతో నిలబడే చేప )

మరిన్ని వార్తలు