కోలీవుడ్‌పై ఐటీ కొరడా.. ఏకంగా 40 చోట్ల తనిఖీలు

3 Aug, 2022 08:20 IST|Sakshi
ఐటీ దాడులు జరిగిన చెన్నైలోని అన్బుచెళియన్‌ కార్యాలయాలు, ఇన్‌సెట్లో అన్బుచెళియన్, ఎస్‌ఆర్‌ ప్రభు, జ్ఞానవేల్‌రాజా

సాక్షి, చెన్నై: ఆదాయపు పన్నుశాఖ కోలీవుడ్‌పై కొరడా ఝుళిపించింది. తప్పుడు లెక్కలు చూపి కేంద్ర ప్రభుత్వానికి పన్ను ఎగవేసిన ఆరోపణలపై రాష్ట్రవ్యాప్తంగా 40 చోట్ల దాడులు చేపట్టింది. సినీ ఫైనాన్షియర్‌ ఇళ్లు, కార్యాలయాలపై మంగళవారం సోదాలు నిర్వహించింది. చెన్నై, మదురై జిల్లాల్లోని ఫైనాన్షియర్లు అన్బుచెళియన్, జ్ఞానవేల్‌రాజా, ఎస్‌ఆర్‌ ప్రభు, నిర్మాత కలైపులి థాను సంస్థల్లో సుమారు 100 మంది ఐటీ  అధికారులు  తనిఖీలు చేశారు.  

పన్ను చెల్లింపులే ప్రాతిపదికగా.. 
తమిళ సినీరంగంలో అతిపెద్ద ఫైనాన్షియర్‌గా పేరుగాంచిన అన్బుచెళియన్‌ గోపురం ఫిలిమ్స్‌ పేరున ఇతర నిర్మాతలకు అప్పులు ఇస్తుంటారు. ఏజీఎస్‌ అనే సంస్థ 2020లో నటుడు విజయ్‌ హీరోగా విడుదలైన బిగిల్‌ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, ఈ చిత్ర నిర్మాతల బృందం గోపురం ఫిలిమ్స్‌ ద్వారా రుణం పొందినట్లు తెలుస్తోంది. అయితే బిగిల్‌ చిత్రం భారీ వసూళ్లు సాధించినా.. స్వల్ప మొత్తంలోనే పన్ను చెల్లించారనే ఆరోపణలు ఉన్నాయి.

దీంతో 2020లో అన్బుచెళియన్‌ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించినప్పుడు పట్టుబడిన డాక్యుమెంట్లను పరిశీలించగా సుమారు రూ.300 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. అంతేగాక లెక్కల్లో చూపని రూ.77 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు అప్పట్లో ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. కాగా, ఇటీవల కమల్‌ హీరోగా విడుదలైన విక్రమ్, శరవణస్టోర్స్‌ శరవణన్‌ సినిమాలకు సైతం అన్బుచెళియన్‌ ఫైనాన్స్‌ చేసినట్లు తెలిసింది.  ఈ సినిమాల నిర్మాణ సమయంలో అక్రమంగా పెద్ద ఎత్తున నగదు చలామణి అయినట్లు ఐటీ అధికారులు అనుమానించారు.

ఈ కారణంతో చెన్నై, మదురైలలోని అన్బుచెళియన్‌ ఇళ్లు, కార్యాలయాల్లో, ఆయన స్నేహితుడైన ప్రముఖ నిర్మాత కలైపులి థాను, ఎస్‌ఆర్‌ ప్రభుకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. 2020–21 మధ్య కాలంలో గోపురం ఫిలిమ్స్‌ జరిపిన ఆర్థిక లావాదేవీలు, ఇతర నిర్మాతలకు ఇచ్చిన అప్పులు, ఇతర లెక్కలను పరిశీలించారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి.  

మరిన్ని వార్తలు