వెలకట్టలేని సెల్యూట్‌.. కోట్లు పెట్టినా దొరకని సంతోషం

4 Nov, 2021 19:39 IST|Sakshi

లక్నో: పుత్రడు పుట్టినప్పటి కంటే.. అతడు వృద్ధిలోకి వచ్చి.. పదిమంది చేత ప్రశంసలు పొందిన నాడు తండ్రికి నిజమైన పుత్రోత్సాహం లభిస్తుంది. అయితే కాలంతో పాటు సమాజం తీరు కూడా మారుతోంది. కొడుకైనా, కూతురైనా ఒకటే.. అనుకుంటున్నారు కొందరు తల్లిదండ్రులు. ఆడపిల్లపై వివక్ష చూపకుండా.. ఆమె ఆశయాలకు, ఆలోచనలకు గౌరవం ఇస్తూ.. వారికి నచ్చిన రంగంలో రాణించేందుకు తోడ్పడుతున్నారు. ఇక వారి అభివృద్ధి చూసి మురిసిపోతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. 

ఐటీబీపీ ఉన్నతాధికారి కుమార్తె ఒకరు అదే రంగంలో ప్రవేశించింది. ఐటీబీపీ ఉద్యోగంలో చేరింది. ట్రైనింగ్‌ పూర్తయిన తర్వాత జరిగే పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌కి ముఖ్య అతిథిగా హాజరైన తండ్రికి సెల్యూట్‌ చేసింది. ఆ క్షణం ఆ తండ్రి పొందిన ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఎన్ని కోట్లు పెట్టినా అలాంటి అపురూప క్షణాలను తీసుకురాలేం. తండ్రి, కుమార్తెలిద్దరూ ఒకరికొకరు సెల్యూట్‌ చేసుకుంటున్న ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతుంది. తండ్రి, కుమార్తెలకు అభినందనలు తెలుపుతున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. 
(చదవండి: బుడ్డోడి సెల్యూట్‌కు గొప్ప బహుమతి!)

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆపేక్షా నింబాడియా ఇండో టిబిటెన్‌ పోలీస్‌ యూనిఫామ్‌ ధరించి.. తన పైఅధికారి ఐటీబీపీ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఏపీఎస్‌ నింబాడియాకి సెల్యూట్‌ చేయగా.. ఆయన తిరిగి సెల్యూట్‌ చేశారు. ఇలా ఒకరినొకరు సెల్యూట్‌ చేసుకున్నది తండ్రి, కుమార్తె కావడం గమనార్హం. ఇలా వారిద్దరూ పరేడ్‌లో సెల్యూట్‌ చేసుకునే సమయంలో.. ఫోటో క్లిక్‌ మనిపించారు. 
(చదవండి: డ్రాగన్‌ దుశ్చర్య.. 55 గుర్రాలపై భారతీయ భూభాగంలోకి.. )

ఈ ఫొటోని ఐటీబీపీ విభాగం తన సోషల్‌ మీడియా షేర్‌ చేసింది. దీనికి ‘‘కుమార్తె సెల్యూట్‌ చేయడంతో.. తండ్రి గర్వంతో ఉప్పొంగిపోతున్నాడు’’ అని క్యాప్షన్‌ కూడా జోడించింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఈ ఫోటోను ఇప్పటివరకు 22వేల మందికిపైగా లైక్‌ చేశారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. ‘‘తనయోత్సాహం.. ఆ తండ్రి పొందే మధురానుభూతిని వర్ణించడానికి మాటలు చాలవు.. అపురూప క్షణాలు’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

ఆపేక్షా నింబాడియా సివిల్‌ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణత సాధించి.. ఉత్తరప్రదేశ్‌లో డీఎస్‌పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరి కుటుంబం నుంచి మూడోతరం వారు కూడా పోలీస్‌ విభాగంలో సేవ చేయడం విశేషం.

చదవండి: భయపెట్టమంటే.. భయానికే భయం పుట్టించాడు!
 

A post shared by ITBP (@itbp_official)

మరిన్ని వార్తలు