నా అంత్యక్రియలు అయిపోయాక మెసేజ్‌ చేస్తా!

18 May, 2022 14:56 IST|Sakshi

సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! 


ఇవేనా స్ట్రోకులు?

ఉక్రెయిన్‌ స్థానాన్ని భర్తీ చేసేలా భారీ గోధుమ ఎగుమతులు అంటూ ముందు పతాక శీర్షికలకు ఎక్కాలి. తర్వాత దేశీయ ధరల పరిస్థితిని బట్టి గోధుమ ఎగుమతులను నిషేధించాలి. మళ్లీ అమెరికా ఆ నిర్ణయంతో సంతోషంగా లేదు కాబట్టి, నిషేధాన్ని సడలించాలి. ఇదంతా కూడా ఐదు రోజుల వ్యవధిలో! అయినా మాస్టర్‌ స్ట్రోకుల్లో విశ్వగురువు కాబట్టి ఏ ఆశ్చర్యమూ కలగడం లేదు.
– జైరామ్‌ రమేశ్, రాజ్యసభ ఎంపీ


దానిక్కూడా రారా మరి!

నా అంతిమ క్రియలు జరిగిన తర్వాత, నా స్నేహితుల్లో ఎవరైనా నా ఫోన్‌ను తీసుకుని, వాటికి హాజరు కానివారికి ఇలా సందేశం పంపాలని కోరుకుంటాను: ‘మిమ్మల్ని ఇవ్వాళ చాలా మిస్సయ్యాను. అయినా ఫర్లేదు, త్వరలోనే కలుసుకుంటాను’.
– అంజలి, వ్యంగ్య రచయిత


లేవాలి... నడవాలి...

డెస్కు దగ్గర రోజంతా అలా కదలకుండా కూర్చోవడానికి మన శరీరం డిజైన్‌ కాలేదు. అది మన దేహ దారుఢ్యానికీ, భంగిమకూ, మానసిక ఆరోగ్యానికీ కూడా భయంకరమైనది. కాబట్టి, గంటలో అది కొద్ది నిమిషాలే అయినా సరే ఒకసారి లేచి నడవాలి. అలాగే లంచ్‌ వేళల్లో ఫోన్‌ మీద పడొద్దు– చిన్న నడక అయినా సాగించాలి. ఎంత సాధ్యమైతే అంత!
– కరోలా సైకోరా, డబ్ల్యూహెచ్‌ఓ క్యాన్సర్‌ ప్రోగ్రామ్‌ మాజీ డైరెక్టర్‌


అదుపు అవసరం

విపాసన, జిక్ర్, యోగా, ధ్యానం తరగతుల వల్ల ఏం ప్రయోజనం, ఇంకొకరిని ట్రోల్‌ చేయాలన్న అమితమైన కోరికను అవి నియంత్రించలేకపోతే?
– ఖాలిద్‌ అనీస్‌ అన్సారీ, సోషియాలజీ ప్రొఫెసర్‌


రుచి అద్భుతం

నా జీవితంలో మొదటిసారి మామిడిపండు తిన్నాను. అది ఎంత బాగుందో చెప్పలేను.
– జో వాల్ష్‌, యూఎస్‌ మాజీ అధ్యక్ష అభ్యర్థి


క్షేమంగా ఉండాలి

అస్సాం వరదల దృశ్యాలు చూస్తుంటేనే గుండె తరుక్కుపోతోంది. ఈ విపత్తు వల్ల ప్రభావితులైన జనాలందరికీ నా ప్రార్థన.
– అభినవ్‌ ఎ.బింద్రా, ఒలింపియన్‌


లేదు వయసు

‘స్పోర్ట్స్‌ ఇల్లస్ట్రేటెడ్‌’ పత్రిక వారి ‘స్విమ్‌సూట్‌ 2022’ కవర్‌ పేజీ మీద 74 ఏళ్ల వయసులో మోడల్‌గా ఉండటం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ఇలాంటివి చేయడానికి ఇదే సమయం.
– మాయే మస్క్, యూఎస్‌ రచయిత్రి


నామకరణం ఇలా...

మారుతీ సుజుకీ హాచ్‌బాక్‌ కార్లలో ‘జెన్‌’ అనేది ఒక ఆక్రోనిమ్‌ అని మీకు తెలుసా? జెడ్‌.ఈ.ఎన్‌. అంటే, జీరో ఇంజిన్‌ నాయిస్‌.
– మీర్జా ఆరిఫ్‌ బేగ్, పాత్రికేయుడు 

మరిన్ని వార్తలు