200 మీటర్ల సొరంగం; ఆత్మాహుతి దాడికి యత్నం!

23 Nov, 2020 10:34 IST|Sakshi
నగ్రోటా ఎన్‌కౌంటర్‌: ఘటనా స్థలి వద్ద అప్రమత్తంగా జవాను

న్యూఢిల్లీ: ఇటీవల నగ్రోటా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌ ప్రదేశంలో దొరికిన కీలక సమాచారం ఆధారంగా సరిహద్దు భద్రతా బలగాలు భారత్‌- పాకిస్తాన్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గల సుమారు 200 మీటర్ల పొడవు గల సొరంగాన్ని కనుగొన్నాయి. గురువారం నాటి ఎన్‌కౌంటర్‌లో నలుగురు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు, వారు దేశంలో ప్రవేశించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు అభిప్రాయపడ్డారు. పక్కా పథకం ప్రకారం కశ్మీర్‌లో ఉగ్రదాడికి పాల్పడేందుకు సిద్ధమైన ముష్కరులు, ఈ క్రమంలో 8 మీటర్ల లోతు, 200- మీటర్ల పొడవు గల సొరంగాన్ని తవ్వినట్లు గుర్తించినట్లు ఆదివారం వెల్లడించాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 160 మీటర్ల దూరంలో గల ఈ సొరంగం కొత్తగా తవ్విందని, దీని గుండా కశ్మీర్‌లోకి చొరబడి ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు ఉగ్రవాదులు పథకం రచించారని భద్రతా అధికాలు అభిప్రాయపడ్డారు. జమ్మూ కశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అవరోధం కలిగించడమే వీరి లక్ష్యంగా భావిస్తున్నట్లు చెప్పారు.

ఈ క్రమంలో.. ‘‘సొరంగం తవ్వడానికి ఇంజనీరింగ్‌ నిపుణుల సహాయం తీసుకున్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. తైవాన్‌లో తయారైన ఈట్రెక్స్‌ 20ఎక్స్‌ జర్మిన్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌(జీపీఎస్‌) డివైస్‌ను ఉ‍గ్రవాదులు ఉపయోగించారు. సరిహద్దు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఓ వాహనాన్ని నిలిపారు. భద్రతా బలగాల చేతికి చిక్కే ముందే భారీ విధ్వంసానికి పాల్పడేందుకు పథకం రచించారు. జీపీఎస్‌ డివైస్‌ ఆధారంగా సేకరించిన డేటాను విశ్లేషించడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి’’ అని ఉగ్ర కార్యకలాపాల నిరోధక విభాగం ఉన్నతాధికారి జాతీయ మీడియాతో పేర్కొన్నారు.(చదవండి: కశ్మీర్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం)

పాక్‌ కుట్రలు బట్టబయలు!
కాగా పాకిస్తాన్‌లోని రేంజర్‌ ఔట్‌పోస్టులు చక్‌ బురా, రాజబ్‌ షాహిద్‌, ఆసిఫ్‌ షాహిద్‌ల గుండా మొదలైన ఈ సొరంగం కశ్మీర్‌ దాకా తవ్వబడిందని, 32. 45648 అక్షాంశం(ఉత్తరం), 75.121815(తూర్పు) రేఖాంశం వద్ద కేంద్రీకృతమైనట్లు నిఘా వర్గాల సమాచారం. ఇక దీపక్‌ రాణా నేతృత్వంలోని 48 బెటాలియన్‌ భద్రతా బలగాలు ఈ సొరంగాన్ని ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో కనుగొన్నట్లు అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. పాక్‌లో తయారైన యూరియా ఫర్టిలైజర్‌, ఇసుక బస్తాలతో దీనిని నింపారు. జీపీఎస్‌ డేటా ఆధారంగా భారత్‌ సరిహద్దులో గల, బీఎస్‌ఎఫ్‌ బార్డర్‌ ఔట్‌పోస్టు రీగల్‌ సమీపంలోని 189 పిల్లర్‌ వద్దకు ఉగ్రవాదులు చేరుకున్నట్లు పేర్కొన్నారు. అక్కడి నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరం నడిచి, ఆర్మీ క్యాంపు సమీపంలో గల రైల్వే ట్రాక్‌ దాటి జాతీయ రహదారి 44 మీదకు చేరుకుని నవంబరు 19 అర్ధరాత్రి ట్రక్కు ఎక్కారని పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దాయాది దేశం పాకిస్తాన్‌ భారత్‌పై ప్రతీకారం తీర్చుకునే దిశగా ఈ మేరకు ప్రయత్నాలు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  కాగా గతంలోనూ భారత్‌- పాక్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా బలగాలు గుర్తించిన విషయం తెలిసిందే. దాదాపు 20 మీటర్ల పొడవు, 25 అడుగుల లోతు గల ఈ టన్నెల్‌ ముఖద్వారం వద్ద లభించిన ప్లాస్టిక్‌ ఇసుక సంచులపై పాకిస్తానీ గుర్తులు(కరాచీ, శకర్‌ఘడ్‌ అనే పదాలు) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉగ్రవాదులు భారత్‌లో చొరబడేందుకు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వీలుగా ఈ సొరంగాన్ని నిర్మించారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫినాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌) ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ తీరు మార్చుకోని పాకిస్తాన్‌ భారత్‌పై విషం చిమ్ముతూ ఉగ్రకుట్రలకు పథకం రచిస్తోందన్న ఆరోపణలకు ఈ పరిణామాలు మరింత బలం చేకూరుస్తున్నాయి.

మరిన్ని వార్తలు