ఢిల్లీ బాంబు పేలుడు మా పనే: జైష్‌ ఉల్ హింద్

30 Jan, 2021 16:26 IST|Sakshi

సాక్ష్యాలు లభించేవరకు నమ్మలేం: దర్యాప్తు సంస్థలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో శుక్రవారం సాయంత్రం ఐఈడీ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇక దీని వెనక ఉగ్రవాద గ్రూపుల హస్తం ఉంటుందని భావిస్తోన్న నేపథ్యంలో దాడి చేసింది తామే అంటూ జైష్‌ ఉల్‌ హింద్‌ అనే ఉగ్రవాద సంస్థ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన చేసింది. అయితే ఇప్పటి వరకు ఈ సంస్థ పేరు ఎప్పుడు, ఎక్కడా వినలేదని.. తెలియదని అధికారులు వెల్లడించారు. టెలిగ్రామ్‌ వేదికగా చేసిన ఈ ప్రకటనకు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. అయితే దర్యాప్తు సంస్థలు కేవలం ఈ ప్రకటన మీద మాత్రమే ఆధారపడకూడదని భావిస్తున్నాయి. సరైన ఆధారాలు లభించేతవరకు దాడి చేసింది జైష్‌ ఉల్‌ హింద్‌ సంస్థ అని నమ్మడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నాయి. దర్యాప్తును తప్పదోవ పట్టించే ప్రయత్నం కూడా అయ్యి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం వైరలవుతోన్న స్క్రీన్‌షాట్లలో ‘‘సర్వశక్తివంతుడైన అల్లా దయ, సాయంతో జైష్‌ ఉల్‌ హింద్‌ సైనికులు ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన నిఘా ఉన్న ప్రాంతంలోకి చొచ్చుకుని వెళ్లి.. ఐఈడీ దాడి చేశారు. భారతదేశం చేసిన దాడులకు ప్రతీకారంగా అల్లా ఆజ్ఞతో మొదలైన ఈ దాడులు కొనసాగుతాయి. ముఖ్యమైన భారతదేశ నగారలను లక్ష్యంగా చేసుకుని ఈ తరహా దాడులు చేస్తాం. వేచి ఉండండి’’ అని ఉంది. 
(ఢిల్లీ పేలుడు : ఇది ట్రైలర్‌ మాత్రమే)

ఇక ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకలు జరిగిన ప్రదేశానికి స​మీపంలో సుమారు 50 మీటర్ల దూరంలో అబ్దుల్ కలాం రోడ్డులో  శుక్రవారం సాయంత్రం ఈ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరాలను పరిశీలనలో పేవ్‌మెంట్ కింద పేలుడు పదార్థాలను అమర్చినట్టు గుర్తించారు. ఫోరెన్సిక్ ఆధారాలను బట్టి  పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ వినియోగించినట్టు అధికారులు భావిస్తున్నారు. దీంతో పాటు క్యాబ్‌లో ఇద్దరు వ్యక్తులు అక్కడ దిగినట్టు గుర్తించిన పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు క్యాబ్ డ్రైవర్‌ నుంచి వివరాలు ఆరా తీస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్ రాయబారికి పంపినట్టుగా భావిస్తున్న పింక్  స్కార్ఫ్‌, ఒక కవరును కూడా సంఘటనా స్థలానికి 12 గజాల దూరంలో స్వాధీనం చేసుకున్నారు. పేలుడును “ట్రైలర్”గా ఈ లేఖలో ప్రకటించినట్టు తెలుస్తోంది. అలాగే గత ఏడాది హత్యకు గురైన ఇరాన్ టాప్‌ సైనికాధికారి  ఖాసిం సోలైమాని, అణు శాస్త్రవేత్త మొహ్సేన్ ఫఖ్రిజాదేహ్ లను అమర వీరులుగా పేర్కొన్నట్టు సమాచారం. దీంతో ప్రతీకార​ చర్యగానే ఈ దాడి జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

మరిన్ని వార్తలు