నా తండ్రిని రక్షణ శాఖ కార్యదర్శిగా... ఇందిర తొలగించారు

22 Feb, 2023 04:22 IST|Sakshi

మంత్రి జైశంకర్‌ 

న్యూఢిల్లీ: దివంగత ప్రధాని ఇందిరాగాంధీ అప్పట్లో తన తండ్రి డాక్టర్‌ కె.సుబ్రమణ్యంను రక్షణ శాఖ కార్యదర్శి పదవి నుంచి తొలగించారని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ చెప్పారు. ‘‘రక్షణ వ్యవహారాల్లో అతి లోతైన పరిజ్ఞానమున్న వ్యక్తిగా నాన్నకున్న పేరు ప్రతిష్టలు అందరికీ తెలుసు. 1979లో కేంద్రంలో జనతా ప్రభుత్వంలో ఆయన కార్యదర్శి అయ్యారు. అప్పట్లో అత్యంత పిన్న వయస్కుడైన కార్యదర్శి బహుశా ఆయనే.

కానీ 1980లో ఇందిరాగాంధీ అధికారంలోకి వస్తూనే మా నాన్నను తొలగించారు’’ అని మంగళవారం ఏఎన్‌ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ‘‘నాన్న చాలా ముక్కుసూటిగా వ్యవహరించేవారు. బహుశా అదేమైనా ఆమెకు సమస్యగా మారిందేమో తెలియదు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘ఇందిర చర్య వల్ల మా నాన్న కెరీర్‌లో ఎదుగుదల శాశ్వతంగా ఆగిపోయింది. తర్వాత ఎన్నడూ కేబినెట్‌ కార్యదర్శి కాలేకపోయారు.

రాజీవ్‌గాంధీ హయాంలో ఆయన కన్నా జూనియర్‌ కేబినెట్‌ కార్యదర్శిగా ఆయన పై అధికారి అయ్యారు. అందుకే మా అన్న కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయికి ఎదిగినప్పుడు నాన్న చాలా గర్వపడ్డారు. కానీ నేను కార్యదర్శి అవడం చూడకుండానే 2011లో కన్నుమూశారు’’ అంటూ చెప్పుకొచ్చారు. జై శంకర్‌ కూడా 2018లో విదేశాంగ శాఖ కార్యదర్శిగా రిటైరవడం తెలిసిందే. 

అనుకోకుండా మంత్రినయ్యా 
కేంద్ర ప్రభుత్వోద్యోగిగా రిటైరయ్యాక తాను రాజకీయాల్లోకి రావడం, మంత్రి కావడం పూర్తిగా తలవని తలంపుగా జరిగిన పరిణామమేనని జైశంకర్‌ అన్నారు. ‘‘కేంద్ర మంత్రివర్గంలో చేరాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఫోన్‌ రావడంతో ఎంతో ఆశ్చర్యపోయా. రాజకీయ రంగ ప్రవేశంపై చాలా ఆలోచించా. ఎందుకంటే నేనప్పుడు అందుకు సిద్ధంగా లేను’’ అంటూ గుర్తు చేసుకున్నారు.

‘‘నా ఉద్యోగ జీవితమంతా రాజకీయ నాయకులను మంత్రులను దగ్గరగా గమనిస్తూనే గడిపాను. అయినా సరే, నిజాయితీగా చెప్పాలంటే మంత్రి అయ్యాక ఆ పాత్రలో రాణించగలనని తొలుత నాకు నమ్మకం కలగలేదు. కానీ మంత్రిగా నాలుగేళ్ల కాలం చాలా ఆసక్తికరంగా సాగింది. ఎంతో నేర్చుకున్నా’’ అన్నారు. మంత్రి అయ్యాకకూడా బీజేపీలో చేరాల్సిందిగా ఎలాంటి ఒత్తిడీ రాకున్నా తనంత తానుగా చేరానన్నారు.

మరిన్ని వార్తలు