Gajendra Singh Shekhawat: కేసీఆర్‌ ఆరోపణలు పెద్ద డ్రామా: కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌

12 Nov, 2021 02:33 IST|Sakshi

సుప్రీంకోర్టులో తెలంగాణ పిటిషన్‌ వల్లే ట్రిబ్యునల్‌

ఏర్పాటు ఆలస్యం.. దీనిపై కేంద్రాన్ని తప్పుపడతారా? 

సీఎం కేసీఆర్‌ ఇలా మాట్లాడటం పెద్ద డ్రామా 

2 రాష్ట్రాలు ఒప్పుకొన్నాకే బోర్డుల పరిధి నోటిఫై చేశాం 

సీఎం కేసీఆర్‌పై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి

గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆగ్రహం 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య నీటి పంపకాల విషయంలో ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు జరిగిన ఆలస్యానికి కేంద్రం కానీ, మంత్రిగా తాను కానీ ఎలా బాధ్యత వహిస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ప్రశ్నించారు. 2015లో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ ఉపసంహరించుకునేందుకు సుప్రీం కోర్టు గత నెల 6న అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ తర్వాతే ట్రిబ్యునల్‌ ఏర్పాటు విషయంలో కేంద్రం పాత్ర ప్రారంభమైందని చెప్పారు. ఈ ఆలస్యానికి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వమే కారణమని, అలాంటప్పుడు కేంద్రాన్ని ఎలా తప్పుబడతారని ప్రశ్నించారు. గురువారం ఢిల్లీలోని జలశక్తి కార్యాలయంలో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంతో కలసి షెకావత్‌ మాట్లాడారు.

ఇటీవల సీఎం కేసీఆర్‌ నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రంపై చేసిన వ్యాఖ్యలపై షెకావత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 ప్రకారం కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ 2015లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కేంద్రం ఇన్నేళ్లుగా చర్యలు తీసుకోలేని స్థితిలో ఉందని తెలిపారు. అక్టోబర్‌ 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం కేసీఆర్‌ కొత్త ట్రిబ్యునల్‌ ప్రస్తావన తీసుకొచ్చారని పేర్కొన్నారు. అయితే ఆ విషయం కోర్టు పరిధిలో ఉందని గుర్తు చేయగా, రెండు రోజుల్లో పిటిషన్‌ వెనక్కి తీసుకునేందుకు దరఖాస్తు చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే 8 నెలల వరకు ఈ విషయంలో ఎలాంటి దరఖాస్తు చేయలేదని చెప్పారు. 

రెండు రాష్ట్రాలు ఒప్పుకొన్నాకే నోటిఫై చేశాం 
నీటి పంపకాల విషయంలో రెండు రాష్ట్రాలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయని, పరిస్థితి ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిన కారణంగా ఏర్పడిన సమస్యను పరిష్కరించాలని ప్రధాని సూచన మేరకు అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఏర్పడినప్పటికీ, పరిధి నోటిఫై చేయని కారణంగా ఆ రెండు బోర్డులు అధికారంలేని సంస్థలుగానే ఉండిపోయాయని షెకావత్‌ అన్నారు. ఈ బోర్డుల పరిధిని నోటిఫై చేసే ప్రక్రియను ప్రారంభించేందుకు గతేడాది జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారని తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో జరిగిన చర్చల తర్వాతే రెండు బోర్డుల పరిధిని నిర్ణయించామని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా సీఎం కేసీఆర్‌ ఇలా వ్యాఖ్యానించడం పెద్ద డ్రామాలా కనిపిస్తోందని షెకావత్‌ విమర్శించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రాన్ని పాలించే వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం తగదన్నారు. బోర్డులను నోటిఫై చేసే విషయంలో ఇరు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నోటిఫై చేసినా.. ఇదంతా డ్రామా అని కేసీఆర్‌ మాట్లాడటం ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థపై విధ్వంసకరమైన దాడి చేయడమేనని విమర్శించారు. అదే సమయలో నూతన ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలా లేక ఉన్న ట్రిబ్యునల్‌కే టర్మ్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ను ఇవ్వాలనే విషయంలో న్యాయ శాఖ అభిప్రాయాన్ని కోరామని తెలిపారు. రెండు బోర్డులను మరింత శక్తిమంతంగా చేసేందుకు ఇరు రాష్ట్రాలు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని షెకావత్‌ సూచించారు. కాగా, విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని, నోటిఫికేషన్‌లో పూర్తి స్పష్టత ఉందని పేర్కొన్నారు. నోటిఫికేషన్‌ ప్రకారం ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడం, అనుమతులు లేని ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు, నిర్వహణ కోసం డీపీఆర్‌లను వెంటనే బోర్డుల ద్వారా సీడబ్ల్యూసీకి అందించాలని సూచించారు. నోటిఫికేషన్‌ కటాఫ్‌ తేదీని వాయిదా వేయాల్సిన అవసరం ఏ మాత్రం లేదని, ఈ విషయంలో రాష్ట్రాలను తాము ఎలాంటి ఒత్తిడి చేయబోమన్నారు. 
 

చదవండి: దూరదర్శన్‌ కేంద్రం: మహిళల బాత్రూమ్‌లో సీక్రెట్‌ కెమెరా

ఏవో పేపర్లు పంపడం కాదు.. 
డీపీఆర్‌ల పేరుతో ప్రాజెక్టులకు సంబంధించిన ఏదో ఒక పేపర్లను రాష్ట్రాలు పంపడం ఎలా సరైనదో చెప్పాలని షెకావత్‌ ప్రశ్నించారు. డీపీఆర్‌లు తప్పనిసరిగా ఉండాల్సిన ఫార్మాట్‌లోనే పంపాలని సూచించారు. నోటిఫికేషన్‌లో వెలిగొండ ప్రాజెక్టు పేరులో వచ్చిన తప్పును సవరించే ప్రక్రియ పార్లమెంటులో జరగాలని, ఇది ఇప్పటికే అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలోనే ఉందని తెలిపారు. ఈ విషయంలో ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారో అర్థం కావట్లేదన్నారు.   

మరిన్ని వార్తలు