ప్రాంతీయ పార్టీల గళం.. జమ్ములో వివాదాస్పద ఉత్తర్వుల ఉపసంహరణ

13 Oct, 2022 11:14 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లో ఎన్నికల నేపథ్యంతో.. స్థానికేతరులకు సైతం ఓటు హక్కు కలిగేలా జారీ చేసిన ఉత్తర్వులపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. ప్రాంతీయ పార్టీలన్నీ దీనికి వ్యతిరేకంగా ఉద్యమించడంతో.. ఆ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. 

ఏడాది కాలంగా జమ్ము రీజియన్‌ జిల్లాలో నివాసం ఉంటున్న వాళ్లకు.. ఎలాంటి ధ్రువీకరణ లేకున్నా నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేయొచ్చంటూ తహసీల్దార్లకు మంగళవారం కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. తద్వారా.. ఆ నివాస ధ్రువీకరణ పత్రాలతో ప్రాంతీయేతరులు సైతం ఓటర్‌ జాబితాలో తమ పేరును నమోదు చేసుకునే లభిస్తుందన్నమాట.  అయితే.. ఈ ఆదేశాలపై ప్రాంతీయ పార్టీలన్నీ భగ్గుమన్నాయి. ఓటర్లను దిగుమతి చేసుకునే బీజేపీ కుట్రలో ఇది భాగమంటూ మండిపడ్డాయి. 

గులాం నబీ ఆజాద్‌.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా, మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలు కేంద్రంపై ‘వలసవాద విధానం’ అంటూ మండిపడ్డారు. రాజకీయ దుమారం చెలరేగడంతో.. వివాదాస్పదమైన ఈ ఉత్తర్వులను గత రాత్రి(బుధవారం) వెనక్కి తీసేసుకున్నారు అధికారులు. 

ఇక జమ్ము కశ్మీర్‌లో ఓటర్‌ నమోదు, సవరణల ప్రక్రియ నవంబర్‌ 25లోపు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. తాజాగా జమ్ము కశ్మీర్‌ పర్యటనకు వెళ్లిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తికాగానే ఎన్నికల నిర్వహణ ఉంటుందని ప్రకటించారు. 

జమ్ము కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దు ముందు దాకా.. అక్కడ శాశ్వత నివాసితులకు మాత్రమే ఓటర్లుగా అవకాశం ఉండేది. అయితే.. ఆగష్టు 2019 తర్వాత స్థానికేతరులకు అవరోధంగా ఉన్న చట్టాలన్నీ రద్దు చేయబడ్డాయి. దీంతో నాన్‌ లోకల్స్‌ను సైతం ఓటర్‌ లిస్ట్‌లో చేర్చేందుకు అవకాశం లభించినట్లయ్యింది. ఈ ఆగష్టులో కొత్త ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియ మొదలుకాగా.. స్థానికేతరులకు అవకాశం లభిస్తే 20-25 లక్షల మధ్య కొత్త ఓటర్లు జత అవుతారని జమ్ము కశ్మీర్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు