సరైన సమయంలో కశ్మీర్‌కు రాష్ట్ర హోదా

14 Feb, 2021 03:57 IST|Sakshi
లోక్‌సభలో మాట్లాడుతున్న అమిత్‌ షా

లోక్‌సభలో అమిత్‌ షా హామీ 

జమ్మూకశ్మీర్‌ రీఆర్గనైజేషన్‌ (సవరణ) బిల్లుకి దిగువ సభ ఆమోద ముద్ర

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు తగిన సమయం చూసి తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లోక్‌సభలో హామీ ఇచ్చారు. కశ్మీర్‌ను దశాబ్దాల తరబడి పరిపాలించిన వారికంటే 2019 ఆగస్టులో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత కేంద్రం ఆ ప్రాంతానికి ఎంతో చేసిందని చెప్పారు. జమ్మూకశ్మీర్‌ రీఆర్గనైజేషన్‌ (సవరణ) 2021 బిల్లుపై జరిగిన చర్చకు అమిత్‌ షా శనివారం లోక్‌సభలో సమాధానమిచ్చారు. జమ్మూకశ్మీర్‌కు మళ్లీ ఎప్పటికైనా రాష్ట్ర హోదా దక్కుతుందని పెట్టుకున్న ఆశలు ఈ బిల్లుతో అడియాసలుగా మారుతున్నాయని కొందరు సభ్యులు వ్యక్తం చేసిన ఆందోళనను ఆయన తోసిపుచ్చారు. అఖిల భారత సర్వీసు ఆఫీసర్స్‌ జమ్మూకశ్మీర్‌ కేడర్‌ని అరుణాచల్‌ ప్రదేశ్, గోవా, మిజోరం యూనియన్‌ టెర్రిటరీలతో కలపడమే ఈ బిల్లు ఉద్దేశమని స్పష్టం చేశారు. కశ్మీర్‌ రాష్ట్ర హోదాకి ఈ బిల్లుకి ఎలాంటి సంబంధం లేదన్న అమిత్‌ షా సరైన సమయం చూసి తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాత మూజువాణి ఓటుతో బిల్లుని సభ ఆమోదించింది. ఈ బిల్లు ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందింది.

కశ్మీర్‌కే మొదట్నుంచి ప్రాధాన్యం
జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370కి మద్దతు పలికి 70 ఏళ్లకు పైగా ఆ ప్రాంతాన్ని అలాగే ఉంచిన కాంగ్రెస్‌ ఇతర పార్టీలు, తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న ఈ బిల్లుపై ఎందుకు ఇన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారో అర్థం కావడం లేదని అమిత్‌ షా అన్నారు. 2014లో మోదీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి జమ్మూకశ్మీర్‌కి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తోందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడైనా కశ్మీర్‌కి స్వేచ్ఛగా వెళ్లి రావచ్చునని చెప్పారు. కశ్మీర్‌ పౌరులెవరూ తమ భూములు కోల్పోరని హామీ ఇచ్చిన అమిత్‌ షా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి తగినన్ని భూములున్నాయని తెలిపారు. స్థానిక అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ పంచాయతీల బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. రాజులు, రాణుల పాలనకు ఎవరూ అంగీకరించరని ప్రజలే ప్రభువులుగా ఉండాలన్నదే ప్రజాభీష్టంగా ఉందని వివరించారు. 2022 నాటికి కశ్మీర్‌కు రైలు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ముగిసిన మొదటి విడత సమావేశాలు
లోక్‌సభ మొదటి విడత బడ్జెట్‌ సమావేశాలు శనివారం ముగిశాయి. రెండో విడత సమావేశాలు తిరిగి మార్చి 8న ప్రారంభమై ఏప్రిల్‌ 8వ తేదీ వరకు జరగనున్నాయి. బడ్జెట్‌ సమావేశాలు సాధారణంగా రెండు విడతలుగా జరుగుతాయి. మొదటి విడతలో పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడం, బడ్జెట్‌ ప్రవేశం పెట్టడం ఉంటాయి. రెండో విడతలో వివిధ శాఖలకు గ్రాంట్ల డిమాండ్లపై సంబంధిత స్టాండింగ్‌ కమిటీల పరిశీలన ఉంటుంది. ఫైనాన్స్‌ బిల్లు, సంబంధిత గ్రాంట్ల డిమాండ్ల ఆమోదం వంటివి ఉంటాయి. కాగా, మొదటి విడత బడ్జెట్‌ సమావేశాలు 100% ఫలప్రదంగా ముగిశాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. జనవరి 29వ తేదీన ప్రారంభమైన ఈ సమావేశాలు నిర్ణీత 50 గంటల్లో 49 గంటలపాటు సభ్యుల కార్యకలాపాలు కొనసాగాయన్నారు. 43 నిమిషాలపాటు మాత్రం అంతరాయం కలిగిందని చెప్పారు. ఈ సమావేశాల్లో సభ్యులు 13 ప్రివిలేజ్‌ నోటీసులు ఇచ్చారన్నారు. బడ్జెట్‌ సమావేశాలు ముఖ్య అంశాలపై చర్చ కోసం అర్ధరాత్రి వరకు కొనసాగిన సందర్భాలున్నాయన్నారు.

5 ట్రిబ్యునళ్ల రద్దుకు లోక్‌సభలో బిల్లు
ప్రజలకు పెద్దగా అవసరం లేని ఐదు ట్రిబ్యునళ్లను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రద్దు ప్రతిపాదిత ట్రిబ్యునళ్లలో ఎయిర్‌పోర్ట్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్, అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్స్‌ అండ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ అప్పిలేట్‌ బోర్డు ఉన్నాయి. వీటి కోసం సినిమాటోగ్రాఫ్‌ చట్టం–1952, కస్టమ్స్‌ యాక్ట్‌–1962, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ యాక్టు–1994 తదితరాలను సవరించనుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ఆర్థిక మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ ట్రిబ్యునళ్లతో ప్రజలకు పెద్దగా ఉపయోగం లేదని మంత్రి అన్నారు. వీటితో ఆర్థిక భారంతోపాటు పరిష్కారంలో కాలయాపన కూడా అవుతోందని చెప్పారు. ప్రస్తుతం ఈ ట్రిబ్యునళ్ల వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులను కమర్షియల్‌ కోర్టులు/హైకోర్టులకు బదిలీ చేస్తామని తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు