జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్​కౌంటర్​.. ఐదుగురు ఉగ్రవాదుల హతం

31 Jan, 2022 06:16 IST|Sakshi

వేర్వేరు ఘటనల్లో ఐదుగురు ముష్కరుల మరణం

శ్రీనగర్‌: జమ్మూ, కశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చిచంపాయి. వీరిలో జైషే మహ్మద్‌ టాప్‌ కమాండర్‌ జహీద్‌ అహ్మద్‌ వని అలియాస్‌ ఉజైర్‌ ఉన్నాడని కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ ఆదివారం తెలిపారు. పుల్వామా, బుడ్‌గావ్‌ జిల్లాల్లో ఉగ్రవాదుల ఆచూకీ సమాచారం అందుకున్న భద్రతాదళాలు కూంబింగ్‌ నిర్వహించాయని తెలిపారు.

పుల్వామాలోని నైరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లో నలుగురు టెర్రరిస్టులు మృతి చెందగా, బుడ్‌గావ్‌లోని చరారే షరీఫ్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన బిలాల్‌ అహ్మద్‌ ఖాన్‌ చనిపోయాడన్నారు. జహీద్‌ వని జైషేలో టాప్‌ కమాండర్‌గా పనిచేస్తున్నాడని, అతని సోదరుడు బాన్‌ప్లాజా దాడిలో నిందితుడని తెలిపారు. 2017 నుంచి జహీద్‌ చురుగ్గా ఉగ్రకార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని చెప్పారు. లోయలో మొత్తం జేషే కార్యకలాపాలకు ఇతనే సూత్రధారి అని, ఇతని మరణం భద్రతా దళాలు సాధించిన గొప్పవిజయమని విజయ్‌ కుమార్‌ ప్రశంసించారు.  

11 ఎన్‌కౌంటర్లు.. 21 మంది ఉగ్రవాదులు
జనవరిలో ఇంతవరకు 11 ఎన్‌కౌంటర్లలో 21మంది టెర్రరిస్టులు మరణించినట్లు చెప్పారు. వీరిలో 8మందికి పాక్‌తో సంబంధం ఉందన్నారు. పలు ఐఈడీ పేలుళ్లతో వనికి సంబంధం ఉందని ఆర్మీ అధికారి మేజర్‌ జనరల్‌ ప్రశాంత్‌ శ్రీవాస్తవ చెప్పారు. ఉగ్రవాదుల్లోకి యువతను రిక్రూట్‌ చేయడంలో కూడా ఇతని పాత్ర ఉందన్నారు. మరణించిన ఇతర ఉగ్రవాదులను కఫీల్‌ భారీ అలియాస్‌ ఛోటూ, వహీద్‌ అహ్మద్‌ రెషి, ఇనాయత్‌ అహ్మద్‌ మిర్‌గా గుర్తించారు.

వీరిలో ఛోటూ పాక్‌ నివాసి. కాల్పుల్లో మరణించిన మిర్‌ ఉగ్రవాదులుంటున్న ఇంటి యజమాని కుమారుడని, హైబ్రిడ్‌ టెర్రరిజానికి ఇది ఉదాహరణఅని ప్రశాంత్‌ తెలిపారు. ఇలాంటి వారికి టెర్రరిస్టులుగా ఐడెంటిటీ ఉండదని, కానీ ఉగ్రవాదులకు సహాయంగా వ్యవహరిస్తుంటారని వివరించారు. పాక్, హైబ్రిడ్‌ టెర్రరిస్టులు భద్రతాదళాలకు అసలు సమస్యన్నారు. జమ్మూ, కశ్మీర్‌లో ఉగ్రవాదుల సంఖ్య తొలిసారి 200 దిగువకు తెచ్చామని తెలిపారు. డ్రోన్లతో పాటు ఇతర మార్గాల్లో వీరికి ఆయుధాలు అందుతున్నాయని, ఈ ఆయుధ మార్గాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని అధికారులు చెప్పారు.

చదవండి: సీన్‌ రివర్స్‌.. కేసులు తగ్గుతున్నా.. మరణాలు పెరుగుతున్నాయ్‌

మరిన్ని వార్తలు