హైదర్‌పురా కాల్పులపై న్యాయ విచారణ

19 Nov, 2021 06:39 IST|Sakshi

శ్రీనగర్‌:  కశ్మీర్‌లోని హైదర్‌పురాలో సోమవారం జరిగిన కాల్పుల ఘటనపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా న్యాయ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా శ్రీనగర్‌ అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ ఖుర్షీద్‌ అహ్మద్‌ షాను నియమించారు.  హైదర్‌పురాలో ఓ ఇంట్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక పాక్‌ ఉగ్రవాది, అతడి సహాయకుడు మహ్మద్‌ అమీర్‌ మాగ్రే, ఇంటి యజమాని మహ్మద్‌ అల్తాఫ్‌ భట్, అందులో అద్దెకు ఉండే ముదాసిర్‌ గుల్‌ మృతిచెందారు. మాగ్రే, అల్తాఫ్‌ భట్, ముదాసిర్‌ గుల్‌కు ఉగ్రవాదులతో సంబంధం లేదని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

మృతదేహాలను అప్పగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ, నాలుగు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని పోలీసులు చెప్పారు.  మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలంటూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా శ్రీనగర్‌లో ధర్నా చేశారు. బాధిత కుటుంబాలకు మద్దతుగా హురియత్‌ కాన్ఫరెన్స్‌ శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. అల్లర్లు జరుగుతాయన్న అనుమానంతో పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(పీడీపీ) అధినేత మహబూబా ముఫ్తీని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులను అరెస్టు చేశారు. మహ్మద్‌ భట్, గుల్‌ మృతదేహాలను వెలికితీసి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు