అక్టోబర్‌లో అమిత్‌ షా పర్యటన.. జమ్మూ కశ్మీర్‌లో జంట పేలుళ్ల కలకలం

29 Sep, 2022 10:23 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో జంట పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఉధంపూర్‌లోని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో డొమిల్‌ చౌక్‌  వద్ద పార్క్‌ చేసిన ఖాళీ బస్సులో బధవారం రాత్రి మొదటి పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. బస్సులోని డ్రైవర్‌ క్యాబిన్‌లో కూర్చున్న కండక్టర్‌ సునీల్‌ సింగ్‌(27), అతని స్నేహితుడు విజయ్‌ కుమార్‌(40)కు గాయాలయ్యాయి. వీరిని ఉధంపూర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

8 గంటల్లో రెండు పేలుళ్లు
ఉధంపూర్‌ జిల్లాలోని పాత బస్టాండ్‌ వద్ద పార్క్‌ చేసిన బస్సులో గురువారం తెల్లవారుజామున 5 గంటలకు మరో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. కాగా 8 గంటల వ్యవధిలో ఉధంపూర్‌ జిల్లాలో జరిగిన రెండో ప్రమాదం ఇది. మొదటి పేలుడు చోటుచేసుకున్న 4 కిలోమీటర్ల దూరంలోనే ఈపేలుడు జరిగింది.

పేలుళ్లకు కారణం?
పేలుడు జరిగిన సమీపంలో ఆపి ఉంచిన ఇతర వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ సంఘటన అనంతరం పోలీసులు, భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే పేలుడుకి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని ఉధంపూర్‌ డీఐజీ తెలిపారు. ఇదిలా ఉండగా ఆరు నెలల తర్వాత ఉధంపూర్ పట్టణంలో ఈ జంట పేలుళ్లు జరిగాయి. చివరగా ఈ ఏడాది మార్చి 9 న స్లాథియా చౌక్‌లో స్టిక్కీ బాంబు పేలుడులో ఒకరు మృతి చెందగా, మరో 17 మంది గాయపడ్డారు.

వచ్చే నెలలో అమిత్‌ షా పర్యటన
కాగా అక్టోబర్‌ మొదటి వారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా  మూడు రోజుల పర్యటన నిమిత్తం జమ్మూ కశ్మీర్‌కు రానున్నారు. కత్రా పట్టణానికి సమీపంలో ఉన్న త్రికుటా హిల్స్‌లోని మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, పూజలు చేయనున్నారు. అనంతరం సరిహద్దు జిల్లా రాజౌరి, బరాముల్లాలో బహిరంగ ర్యాలీలో ప్రసంగించడంతో పాటు, అక్కడే బస చేయనున్నారు. అయితే కేంద్రమంత్రి పర్యటన ముందు ఉధంపూర్ పట్టణంలో రెండు శక్తివంతమైన పేలుళ్లు సంభవించడం కలకలం రేపుతోంది. హోంమంత్రి  సందర్శనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు, భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

మరిన్ని వార్తలు