కశ్మీర్‌కు 47..జమ్మూకు 43

6 May, 2022 06:02 IST|Sakshi
గెజిట్‌ను విడుదల చేస్తున్న రిటైర్డు జస్టిస్‌ దేశాయ్, సుశీల్‌ చంద్ర, కేకే శర్మ

మొత్తం 90 అసెంబ్లీ సీట్లు..

ఐదు పార్లమెంట్‌ స్థానాలు

గెజిట్‌ విడుదల చేసిన జమ్మూకశ్మీర్‌ పునర్విభజన కమిషన్‌

నామినేషన్‌ విధానంలో కశ్మీరీ

పండిట్లకు చోటివ్వాలని సిఫారసు

న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లోని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల పునర్విభజన కసరత్తు పూర్తయింది. కశ్మీర్‌ డివిజన్‌కు 47 అసెంబ్లీ స్థానాలను, జమ్మూ డివిజన్‌కు 43 సీట్లను ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ రంజన ప్రకాశ్‌ దేశాయ్‌ నేతృత్వంలోని డీలిమిటేషన్‌ కమిషన్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అనంతరం ఈ నివేదికను న్యాయశాఖకు అందజేసింది వివిధ రాజకీయ పక్షాలు, పౌరులు, పౌర సంఘాలతో చర్చలు జరిపిన మీదట ఈ ప్రతిపాదనలకు తుదిరూపు ఇచ్చినట్లు కమిషన్‌ వివరించింది.

పునర్విభజన ప్రక్రియ కోసం జమ్మూకశ్మీర్‌ను ఒకే ప్రాంతంగా పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది. గతంలో జమ్మూలో 37, కశ్మీర్‌లో 46 అసెంబ్లీ సీట్లు కలిపి మొత్తం 83 సీట్లు ఉండేవి. తాజా ప్రతిపాదనల ప్రకారం జమ్మూకు మరో 6, కశ్మీర్‌కు అదనంగా ఒక సీటు కలిపి అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య మొత్తం 90కి చేరుకుంది. సంబంధిత జిల్లాల పరిధిలోనే ఈ అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయని తెలిపింది. కశ్మీరీ పండిట్లకు నామినేషన్‌ విధానంలో కనీసం రెండు స్థానాలను కేటాయించాలని, ఇందులో ఒకటి మహిళలకు రిజర్వు చేయాలని సూచించింది.

పుదుచ్చేరి అసెంబ్లీలో మాదిరిగా నామినేటెడ్‌ సభ్యులకు ఓటు హక్కు ఉండాలని పేర్కొంది. అదేవిధంగా, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వలస వచ్చిన వారికి అసెంబ్లీ, పార్లమెంట్‌లలో కొన్ని సీట్లు రిజర్వు చేయాలంది. జమ్మూలో 6, కశ్మీర్‌లో 3 చొప్పున మొత్తం 9 సీట్లను గిరిజనులకు ప్రత్యేకించాలని మొదటిసారిగా కమిషన్‌ సూచించింది. మొత్తం ఐదు పార్లమెంటరీ స్థానాల పరిధిలోకి 18 చొప్పున అసెంబ్లీ సీట్లను కమిషన్‌ కేటాయించింది. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ ఎంపీ స్థానం పరిధిలోకి జమ్మూలోని రాజౌరి, పూంఛ్‌ అసెంబ్లీ సీట్లను తీసుకువచ్చింది.

స్థానిక ప్రతినిధులు, ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తన్మార్గ్, జూనిమార్, దర్హాల్‌ తదితర అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లను మార్చినట్లు వివరించింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుతోపాటు, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ 2019 ఆగస్ట్‌లో పార్లమెంట్‌ చట్టం చేసిన అనంతరం 2020 మార్చిలో రెండేళ్ల కాలపరిమితితో నియమించిన ఈ కమిషన్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర, జమ్మూకశ్మీర్‌ ఎన్నికల కమిషనర్‌ కేకే శర్మ ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా, మరో ఐదుగురు అసోసియేట్‌ సభ్యులుగా ఉన్నారు.

చదవండి: (భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. పాక్‌ నుంచి ఆదిలాబాద్‌కు ఆయుధాలు, పేలుడు పదార్థాలు)

మరిన్ని వార్తలు