Pulwama Encounter: ఉగ్రవాదుల ఏరివేత.. జమ్ముకశ్మీర్‌లో హైఅలర్ట్‌

12 Mar, 2022 08:24 IST|Sakshi

జమ్ముకశ్మీర్‌లో శనివారం ఉదయం హైఅలర్ట్‌ ప్రకటించారు భద్రతా అధికారులు. శుక్రవారం రాత్రి నుంచి జమ్ములోని వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లలో ముగ్గురు ముష్కరులను మట్టుపెట్టినట్లు అధికారులు ధృవీకరించారు. 

శుక్రవారం రాత్రి సమయంలో.. పుల్వామా చవల్కాన్‌లో, హంద్వారా నెచమా, గందర్‌బాల్‌ ఏరియాల్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈక్రమంలో గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులు జరపగా, భద్రతా దళాలు ప్రతిదాడికి దిగాయి. శనివారం వేకువ జామున వరకు జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు హతమయ్యారని కశ్మీర్‌ ఐజీ విజయ్‌కుమార్‌ చెప్పారు. మరొకరికోసం గాలిస్తున్నామన్నారు.

పుల్వామాలోని చవల్కాన్‌ ప్రాంతంలో జైషే మహమ్మద్‌కు చెందిన టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు విజయ్‌ కుమార్‌ తెలిపారు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నట్లు వెల్లడించారు. చనిపోయిన ఉగ్రవాదుల్లో JeM కమాండర్‌ కమాల్‌ భాయ్‌ తో పాటు ఒక పాకిస్థానీ ఉన్నట్లు వెల్లడించారు.

ఇక గందర్‌బల్‌ హంద్వారాలో జరిగిన ఎదురుకాల్పులో ఒక ఉగ్రవాది హతమయ్యాడని, అతడు లష్కరే తొయిబా సంస్థకు చెందిన టెర్రరిస్టుగా గుర్తించామన్నారు. పలుచోట్ల సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతున్నదని చెప్పారు.

మరిన్ని వార్తలు