చంపడానికే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారా?.. నిరసనలకు కశ్మీరీ ముస్లింల మద్దతు

13 May, 2022 15:47 IST|Sakshi

శ్రీనగర్‌: కశ్మీరీ పండిట్‌ రాహుల్‌ భట్‌ కాల్చివేత ఘటన జమ్ము కశ్మీర్‌ను అట్టుడికిపోయేలా చేస్తోంది. ఈ ఘటనకు నిరసనగా పలు చోట్ల కశ్మీరీ పండిట్లు పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తుండడంతో పోలీసులు టియర్‌గ్యాస్‌, లాఠీచార్జ్‌ ప్రయోగించి అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బుద్గం జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ప్రభుత్వ ఉద్యోగి అయిన రాహుల్‌ భట్(36)‌.. టెర్రరిస్టుల దాడిలో చనిపోయాడు. బుద్గాం జిల్లా చదూర గ్రామం తహసీల్దార్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు విరుచుకుపడి కాల్పులు జరిపారు. ఆస్పత్రికి తరలించే లోపు ఆయన ప్రాణం విడిచాడు. గత ఆరు నెలల్లో ఇది మూడో ఘటన. ఈ ఘటనకు నిరసనగా కశ్మీర్‌ పండిట్లు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. 

గురువారం సాయంత్రం నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. క్యాంపుల నుంచి బయటకు వస్తున్న కశ్మీరీ పండిట్లు.. రోడ్లను దిగ్భంధించి, కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌ వైపు మార్చ్‌గా వెళ్తున్న నిరసనకారుల్ని టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి చెల్లాచెదురు చేశాయి భద్రతా బలగాలు. 

అందుకే తీసుకొచ్చారా?
కేంద్ర బీజేపీ ప్రభుత్వంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాకు వ్యతిరేకంగా కశ్మీరీ పండిట్లు నినాదాలు చేస్తున్నారు. ‘‘సిగ్గుపడాల్సిన ఘటన ఇది. ప్రభుత్వాన్ని మేం నిలదీస్తున్నాం. ఇదేనా పునరావాసం అంటే? మమ్మల్ని చంపడానికే ఇక్కడికి తీసుకొచ్చారా? ఇక్కడసలు భద్రత ఏది? మా పని మేం చేసుకోవడానికి వచ్చాం. మమ్మల్ని ఎందుకు చంపడం? మేం చేసిన నేరం ఏంటి? ఇదంతా నిర్వాహక వైఫల్యమే!. ఆందోళనలు వ్యక్తం చేస్తే టియర్‌ గ్యాసులు ప్రయోగిస్తారా? అంటూ మండిపడుతున్నారు కశ్మీరీ పండిట్లు. 

బుద్గం షెకాపోరాలో ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. స్థానిక ముస్లింలు.. కశ్మీరీ పండిట్లకు మంచి నీళ్లు, భోజన సదుపాయాలు కల్పించడంతో పాటు వాళ్లకు న్యాయం జరగాలని, భద్రతా అందాలంటూ గళం కలిపారు. ‘‘ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా కశ్మీరీ పండిట్లకు భద్రత లేకపోతే ఎలా? ఇంక ఎక్కడికి వెళ్లాలి వాళ్లు?ఇది పూర్తిగా పరిపాలనపరమైన వైఫల్యమే. కశ్మీర్‌ ముస్లింలందరికీ విజ్ఞప్తి. కశ్మీరీ పండిట్లకు మద్దతుగా ముందుకు వచ్చి నిరసనలు చేపట్టండి అంటూ తమ కమ్యూనిటీ అక్కడి ప్రజలు పిలుపు ఇస్తున్నారు.

ట్రాన్స్‌ఫర్‌ అడిగారు!
కశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో రాహుల్‌ భట్‌ ఆరు నెలల కిందటే ట్రాన్స్‌ఫర్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఆయన అభద్రతా భావంలోకి కూరుకపోయారని ఆయన భార్య చెప్తున్నారు.

మరిన్ని వార్తలు