చైతన్య భారతి: ఆదర్శవాద మేధావి! ‘ఆఫ్టర్‌ నెహ్రూ, హూ?

12 Jun, 2022 15:53 IST|Sakshi

జవహర్‌లాల్‌ నెహ్రూ 1889–1964: నెహ్రూ మరణించడానికి ఏడాది ముందు ఒక ప్రముఖ అమెరికన్‌ పాత్రికేయుడు ‘ఆఫ్టర్‌ నెహ్రూ, హూ?’ అనే పుస్తకం రాశారు. నిజానికి ఆయన తరువాత పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ప్రపంచమంతటికీ వచ్చిందే. ఆయన మరణించిన దాదాపు నాలుగు దశాబ్దాలకు గానీ, నెహ్రూ భావజాలం దేశంలో చెక్కు చెదరనంత శక్తిమంతమైన నాయకత్వం నెహ్రూది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన మొదటి పదిహేడేళ్లు నెహ్రూయే భారతదేశం, భిన్న ధ్రువాల విచిత్ర సంగమం ఆయన. సదుపాయాల భోగంలో పెరిగిన కులీన కుటుంబీకుడు కష్టజీవుల నిత్య వేదనకు సానుభూతితో స్పందించడం ఆయనలో ఒక చిత్రం.

భావోద్వేగాలతో స్పందించే ఆదర్శవాద మేధావి, ఉదాత్తమైన సమతా వాద భావాలకు పట్టం కట్టిన నెహ్రూ... హారో, కేంబ్రిడ్జ్‌లలో ఆంగ్లోపాసన చేసిన విద్యావేత్త. బ్రిటిష్‌ జైళ్లలో పదేళ్లకు పైగా కాలం గడిపిన వ్యక్తి కూడా. మహాత్మా గాంధీ నుంచి అనూహ్యంగా ప్రత్యేక ప్రోత్సాహం పొందిన నాయకుడు. భారతదేశానికి నెహ్రూ అందించిన వారసత్వానికి నాలుగు మూల స్తంభాలు : ప్రజాస్వామిక వ్యవస్థల నిర్మాణం లౌకికవాదం, స్వదేశంలో సమతా వాద ఆర్థిక వ్యవస్థ, విదేశీ విధానంలో అలీన మార్గం. భారతదేశ నైతిక, నాగరిక చరిత్ర మీద ఆధారపడి, ప్రపంచంలో భారతదేశానికి ఒక పాత్రను నెహ్రూ నిర్దేశించారు. దళితులకు, దగా పడిన వారికి గళం కల్పించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఆయన తెచ్చిన ప్రతిష్ట కొన్ని ఏళ్ల పాటు పనికొచ్చింది.

కానీ, 1962లో చైనాతో తలెత్తిన యుద్ధం కారణంగా కలిగిన అవమానం అటువంటì ప్రతిష్టకు గల పరిమితులను చాటింది. అధికారంలో సమున్నత స్థాయిలో ఉన్న రోజుల్లో ఆయన ఒక వ్యాసం రాసి, తన పేరు లేకుండా ప్రజల్లోకి వదిలారు. నియంత కావాలనే ప్రేరణలు తనలో కలుగకుండా అడ్డు కట్ట వేయాలని దానిలో ప్రబోధించారు. ‘‘ఆయనను హద్దుల్లో ఉంచాలి. మనం సీజర్లను కోరుకోవడం లేదు’’ అని నెహ్రూ తన గురించి తానే దానిలో రాశారు.  తన లోటుపాట్ల వల్ల కానీ, అనుచరుల లోటు పాట్ల వల్ల కానీ ప్రజలలో తన స్థాయి ఏమాత్రం దెబ్బతినని అరుదైన నాయకుడు నెహ్రూ. భారతదేశానికి ఎలాంటి వారసత్వాన్ని అందించాలని మీరు ఆశిస్తున్నారని అమెరికన్‌ సంపాదకుడు నార్మన్‌ కజిన్స్‌ ఒకసారి నెహ్రూను ప్రశ్నించారు. ‘‘నలభై కోట్ల మంది ప్రజలు తమను తాము పరిపాలించుకునే సామర్థ్యం.. ’’ అని నెహ్రూ సమాధానం ఇచ్చారు.
– శశి థరూర్‌ పుస్తకం ‘నెహ్రూ : ది ఇన్వెషన్‌ ఆఫ్‌ ఇండియా’ నుంచి

(చదవండి: ఘట్టాలు: టాటా గ్రూపు ఆవిర్భావం)

మరిన్ని వార్తలు