‘నాకేమీ వద్దు ప్లీజ్‌ లే నాన్నా.. నువ్వెందుకు లేవడం లేదు..’

7 May, 2023 12:12 IST|Sakshi

దాల్పట్‌: ‘‘నాన్నా.. నువ్వెందుకు లేవడం లేదు? నాకేమీ వద్దు. ప్లీజ్‌.. లే నాన్నా!’’ అంటూ ఓ చిన్నారి.. జవాన్‌ తండ్రి కోసం కంటతడి పెట్టుకుంది. ఆమె కన్నీరు చూసి అక్కడున్న వారంతా ఆవేదన చెందారు. కాగా, జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో ఉగ్రదాడుల్లో మృతిచెందిన పారాట్రూపర్‌ నీలంసింగ్‌ ముఖాన్ని చేతితో తాకుతూ పదేళ్ల చిన్నారి పావన రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది.

వివరాల ప్రకారం.. రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో శుక్రవారం టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మరణించారు. మృతిచెందిన వారిలో హవిల్దార్‌ నీలంసింగ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో నీలంసింగ్‌‌ శవపేటిక శనివారం స్వగ్రామం చేరుకుంది. దీంతో, స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నీలంసింగ్‌కు నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. 

ఇక, నీలంసింగ్‌ పార్థివ దేహాన్ని చూసి ఆయన కుమార్తె పవనా చిబ్‌(10).. ‘‘నాన్నా.. నువ్వెందుకు లేవడం లేదు? నాకేమీ వద్దు. ప్లీజ్‌.. లే నాన్నా!’’ అంటూ కన్నీరుపెట్టింది.  పక్కనే నిలుచున్న నీలంసింగ్‌ భార్య వందన.. భర్త ముఖాన్ని రెండు చేతులతో పట్టుకొని కన్నీరుమున్నీరు అయ్యారు. ఏడేళ్ల కుమారుడు అంకిత్‌ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కాగా, వేల మంది సమక్షంలో దలపత్‌ గ్రామంలో శనివారం నీలంసింగ్‌ అంత్యక్రియలు జరిగాయి.

అంతకుముందు.. రాజౌరీ సెక్టార్‌ పరిధిలోని కాండి అడవిలో కొంతమంది ఉగ్రవాదులు దాగివున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు బుధవారం సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో అడవిలోని ఓ గుహలో ఉగ్రవాదులు దాగివుండటాన్ని జవాన్లు శుక్రవారం ఉదయం గుర్తించారు. దీంతో సైనికులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. జవాన్లపై ఉగ్రవాదులు పేలుడు పదార్థం విసరడంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందగా, నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉదంపూర్‌ దవాఖానకు తరలించారు. తీవ్ర గాయాలతో మరో ముగ్గురు దవాఖానలో మరణించారని ఆర్మీ పేర్కొన్నది.

ఇది కూడా చదవండి: హింసాకాండలో 54 మంది మృతి.. మ‌ణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత

మరిన్ని వార్తలు