-

జయలలితకు సరైన చికిత్స అందలేదు.. ఆర్ముగ స్వామి సంచలన వ్యాఖ్యలు

28 Nov, 2022 08:38 IST|Sakshi

సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలితకు సరైన చికిత్స అందలేదని రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జయలలిత మృతి కేసును ఆర్ముగస్వామి కమిషన్‌ విచారించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి ఆయన ఇటీవల సమర్పించిన విషయం తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఆదివారం తిరుప్పూర్‌లోని ఓ కళాశాలలో జరిగిన స్నాతకోత్సవానికి హాజరైన ఆయన్ని మీడియా ప్రతినిధులు కదిలించారు. జయలలిత మృతి కేసు విచారణ గురించి ప్రశ్నలు సంధించారు.

ఇందుకు ఆయన స్పందిస్తూ, ఆమెకు సరైన చికిత్స అందలేదనే విషయం తన విచారణలో స్పష్టమైందన్నారు. హృదయ సంబంధిత సమస్య తలెత్తిన నేపథ్యంలో అందుకు సంబంధించిన చికిత్సను ఆమెకు సకాలంలో అందించడంలో నిర్లక్ష్యం వహించినట్లు తేలిందన్నారు. యాంజీయో చేయాల్సి ఉందని, అయితేఆ దిశగా కనీస ప్రయత్నాలు జరగక పోవడం శోచనీయమని పేర్కొన్నారు. తాను న్యాయ  శాస్త్రాన్ని చదివానని, అనేక కేసుల్లో ఎందరో సూచనలు, సలహాలు గతంలో తీసుకుని ఉన్నానని తెలిపారు. ఇక వైద్య రంగం మీద కూడా కాస్త అనుభవం ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.   
 

మరిన్ని వార్తలు