ఎయిర్‌ అంబులెన్స్‌గా జయలలిత హెలికాప్టర్‌ 

1 Oct, 2021 07:26 IST|Sakshi

సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత హయాంలో 2006లో కొనుగోలు చేసిన ప్రభుత్వ హెలికాప్టర్‌ను ఎయిర్‌ అంబులెన్స్‌గా మార్చేందుకు డీఎంకే ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అప్పట్లో సీఎం పర్యటనల కోసం దీన్ని సిద్ధం చేశారు. సీఎంతో పాటుగా 14 మంది పయనించేందుకు అవసరమైన వసతులు ఇందులో ఉన్నాయి. అయితే తర్వాత వచ్చిన డీఎంకే సర్కారు ఈ హెలికాప్టర్‌ను పెద్దగా వాడుకోలేదు. 2011లో మళ్లీ అధికారంలోకి వచ్చిన జయలలిత దాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నారు. దీంతో అమ్మ హెలికాప్టర్‌గా ఇది ముద్ర పడింది. అమ్మ మరణం తర్వాత సీఎంగా పళనిస్వామి కొన్ని సందర్భాల్లో ఉపయోగించినా, చివరకు 2019 నుంచి ఇది మీనంబాక్కం విమానాశ్రయానికే పరిమితమైంది. ఇక ప్రస్తుత సీఎం స్టాలిన్‌ హెలికాప్టర్‌ పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లినా, రైలు, విమానం లేదా రోడ్డు మార్గంలోనే పయనిస్తున్నారు.  

చదవండి: (భార్యపై కోపంతో కారు, 4 బైకులకు నిప్పు పెట్టిన ఐటీ ఉద్యోగి)

అత్యవసర వైద్య సేవలకు 
వృథాగా పడి ఉన్న ప్రభుత్వ  హెలికాప్టర్‌ సేవను ఎయిర్‌  అంబులెన్స్‌గా ఉపయోగించాలని సీఎం నిర్ణయించినట్టు సమాచారం. ఇందుకు తగ్గ కసరత్తులు ఆరోగ్య శాఖ చేపట్టడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ హెలికాప్టర్‌ 2,449 గంటలు మాత్రమే ప్రయాణించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, వైద్య కళాశాలల ఆవరణల్లో హెలికాప్టర్‌ ల్యాండింగ్, టేకాఫ్‌కు తగ్గ వసతులు ఉన్న దృష్ట్యా, అత్యవసర వైద్య సేవలకు ఎయిర్‌ అంబులెన్స్‌గా సర్కారీ హెలికాప్టర్‌ను మార్చేందుకు సిద్ధమవుతున్నారు. అమ్మ హెలికాప్టర్‌ను రంగంలోకి దిగిన పక్షంలో రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది.  

చదవండి: (అప్పుడు కేరళలో.. ఇప్పుడు తమిళనాడులో.. ఆ హక్కు మీకు ఉంది!)

మరిన్ని వార్తలు