Jayalalitha Death Mystery: ​అపోలో వైద్యులకు సమన్లు

3 Mar, 2022 10:49 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఆర్ముగస్వామి కమిషన్‌ ఎయిమ్స్‌ వైద్యుల సహకారంతో ఈనెల 7వ తేదీ నుంచి దర్యాప్తును వేగవంతం చేయనుంది. ఇందులో భాగంగా బుధవారం అపోలో వైద్యులకు సమన్లు జారీ అయ్యాయి. జయలలిత మరణం మిస్టరి నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య  కమిషన్‌ను గత అన్నాడీఎంకే ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. వాయిదాల పర్వంతో ఏళ్ల తరబడి ఈ విచారణ కొనసాగుతోంది.

అదే సమయంలో తమను విచారణ పరిధిలోకి ఈ కమిషన్‌ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ అపోలో యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో రెండేళ్ల కాలం వృథా అయ్యింది. గత ఏడాది పగ్గాలు చేపట్టిన డీఎంకే సర్కారు సైతం ఈ  కమిషన్‌ పదవీ కాలాన్ని పొడిగించి విచారణను త్వరితగతిన ముగించాలని ఆదేశించింది. అదే సమయంలో సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఆర్ముగ స్వామికి సహకారంగా ఎయిమ్స్‌ వైద్యులను సుప్రీంకోర్టు రంగంలోకి దించింది.

గత నెల ఈ వైద్య బృందంతో కమిషన్‌ వర్గాలు సమావేశమయ్యాయి. వైద్యపరంగా తమకు ఉన్న అనుమానాల్ని నివృతి చేసుకున్నారు. ఇక, వీరి సహకారంతో విచారణను వేగవంతం చేసి ప్రభుత్వానికి మరికొన్ని నెలల్లో నివేదిక సమర్పించేందుకు కార్యచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అప్పట్లో జయలలితకు చికిత్స అందించిన అపోలో వైద్యులను ఈ కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయనుంది.

>
మరిన్ని వార్తలు