ఆత్మహత్యకు అనుమతించండి: గ్రామ రైతులు

29 Jul, 2021 08:06 IST|Sakshi
ఆత్మహత్యకు అనుమతి కోరుతున్న రైతులు

జయపురం: భూ కబ్జాదారుల నుంచి బాధలు తాళలేక పోతున్నామని, దీనిపై పలుమార్లు విన్నవించుకున్నా అధికారులు పట్టించకోవడం జయపురం సమితి అంతా గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు భరించలేమని, తమ తమ కుటుంబాలతో సహా ఆత్మహత్య చేసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టును కోరారు. దీనిపై బాధిత రైతులు శంకర్షణ ఆచార్య, నట్వర మండల్, హరిహర పండా సర్వోన్నత న్యాయ స్థానానికి బుధవారం రాసిన లేఖను విలేకర్ల ముందు ప్రదర్శించారు. దీనిపై వారు మాట్లాడుతూ... తమ ఇరుగుపొరుగు రైతులు వారి స్థలాన్ని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు విక్రయించారని, అతను ఆ భూమిని ప్లాట్లు చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అయితే పక్కన ఉన్న సాగునీటి కాలువను కబ్జా చేసి, చదును చేసి ప్లాట్లుగా అమ్మకం పెట్టారని ఆరోపించారు.

దీంతో సాగునీరు అందక తమ భూములు బీడు బారాయని వాపోయారు. సమస్యపై తహసీల్దార్, కొరాపుట్‌ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. పట్టించుకోలేదన్నారు. అయితే సంబంధిత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అప్పటి నుంచి తమను చంపుతామని, మా భూమిని సైతం విక్రయించాలని బలవంతం చేస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. అదే జరిగితే తమ కుటుంబం అంతా రోడ్డున పడతామన్నారు. తమ సమస్యను పరిష్కరించాలని, లేదా ఆత్మహత్యకు అనుమతివ్వాలని విలపించారు. దీనిపై సీఎం కార్యాలయం తోపాటు హైకోర్టుకు లేఖ రాసినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు