మాజీ ప్రధాని సంచలన ప్రకటన

10 Feb, 2021 22:00 IST|Sakshi

బెంగళూరు: భారత మాజీ ప్రధాని, కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ సెక్యూలర్(జేడీఎస్) అధినేత హెచ్‌డీ దేవేగౌడ బుధవారం సంచలన ప్రకటన చేశారు. కర్ణాటకలో త్వరలో జరుగబోయే ఓ లోక్‌సభ, మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీకి దూరంగా ఉంటుందని ప్రకటించారు. డబ్బుల్లేక పోవడంతో వారి పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో త్వరలో బెల్గాం లోక్‌సభతో పాటు బసవకళ్యాణ్, సింధి, మస్కీ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

అయితే 2023లో జరుగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతు కృషిని చేస్తానని దేవేగౌడ ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజల సహకారంతో పార్టీని కాపాడుకునేందుకు తన ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. కాగా, దేవేగౌడతో పాటు ఆయన కుమారుడు కుమారస్వామి కూడా కర్ణాటక సీఎంగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు దేవేగౌడ చేసిన ప్రకటనను రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలు కొట్టిపారేస్తున్నాయి. ఎన్నికల వ్యూహంలో భాగంగా ఆయన ఇలాంటి ప్రకటన చేసివుండవచ్చని అభిప్రాపడుతున్నాయి.

మరిన్ని వార్తలు