JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం ఇలా..!

29 Mar, 2021 17:23 IST|Sakshi

దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే..  జేఈఈ అడ్వాన్స్‌డ్‌  పరీక్షలో ఉత్తీర్ణులవ్వడం తప్పనిసరి. ఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించడానికి ప్రత్యేక మ్యాజిక్‌ ఫార్ములాలు అంటూ ఏమీలేవు. పక్కా ప్రణాళిక, పట్టుదలతో కూడిన ప్రిపరేషన్‌ మాత్రమే అడ్వాన్స్‌డ్‌లో విజయానికి దారి చూపుతుంది. జేఈఈ అడ్వాన్స్‌ పరీక్ష జులై 3న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం సబ్జెక్ట్‌ వారీ ప్రిపరేషన్‌ టిప్స్‌..

ఐఐటీలు వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో ఇంజనీరింగ్‌ చదవాలని దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు కోరుకుంటారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో అర్హత సాధించిన వారు మాత్రమే ఐఐటీల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. అందుకే విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించేందుకు ఇంటర్‌లో చేరిన తొలిరోజు నుంచే ప్రిపరేషన్‌ సాగిస్తుంటారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు హాజరు కావాలంటే.. మొదట జేఈఈ మెయిన్‌ పరీక్షల్లో టాప్‌లో నిలవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం నాలుగుసార్లు నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలు.. ఇప్పటికే రెండుసార్లు జరిగాయి. 


ఈ ఏడాది ఇలా
ఈ ఏడాది జులై 3వ తేదీన అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరుగనుంది. కొవిడ్‌ కారణంగా గతేడాది రాయలేకపోయిన వారు, ప్రస్తుతం అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు హాజరుకాబోయే వారితో ఈసారి పోటీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి విద్యార్థులు సరైన ప్రణాళికతో సబ్జెక్ట్‌ వారీ ప్రిపరేషన్‌తో ముందుకు వెళ్తేనే పరీక్షలో విజయం సాధించేందుకు వీలుంటుంది. 

సన్నద్ధత ఇలా
ప్రస్తుత సంవత్సరం జరిగే పరీక్షా స్వరూపంలో ఎలాంటి మార్పులు లేవు. ఎప్పటిలాగానే ఆన్‌లైన్‌ విధానంలో మూడు గంటల కాలవ్యవధితో పరీక్షను నిర్వహించనున్నారు.  సిలబస్‌ విషయానికివస్తే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి  ప్రశ్నలుంటాయి. కాబట్టి అభ్యర్థులు సబ్జెక్ట్‌ వారీగా ఆయా సిలబ్‌ అంశాలపై దృష్టిపెట్టి ప్రిపరేషన్‌ కొనసా గించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

సబ్జెక్ట్‌ల వారీగా ప్రిపరేషన్‌
మ్యాథమెటిక్స్‌ : జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షలో మ్యాథమెటిక్స్‌ విభాగంలో మంచి స్కోర్‌ సాధించాలంటే.. ప్రాక్టీస్‌ చాలా ముఖ్యం. ఇందులో సూత్రాలను ఎక్కువగా గుర్తుపెట్టుకోవ డానికి షార్ట్‌ కట్‌ మెథడ్స్‌ను తెలుసుకోవాలి. కోఆర్డినేట్‌ జామెట్రీ, డిఫరెన్షియల్‌ కాలిక్యులస్, ఇంటిగ్రల్‌ కాలిక్యులస్, మాట్రిక్స్‌ అండ్‌ డిటర్మినెంట్స్‌తోపాటు 3డీ జామెట్రీ, కోఆర్డినేట్‌ జామెట్రీ, వెక్టార్‌ అల్జీబ్రా, ఇంటిగ్రేషన్, కాంప్లెక్స్‌ నెంబర్స్, పారాబోలా, ట్రిగ్నోమెట్రిక్‌ రేషియోస్,  క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్‌ ఈక్వేషన్స్, పెర్ముటేషన్‌ అండ్‌ కాంబినేషన్, బైనామియల్‌ థీరమ్, లోకస్‌ తదితర అంశాలపై బాగా పట్టు సాధించాలి. 

కెమిస్ట్రీ: కెమిస్ట్రీ సబ్జెక్టు కాంబినేషన్‌ అఫ్‌ థియరీగా ఉంటుంది. ఈక్వేషన్స్‌ అండ్‌ రియాక్షన్‌ వంటి కలయికతో ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కెమిస్ట్రీ కోసం ప్రత్యేకంగా నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి. వీటిని నోట్‌బుక్‌లో రాసుకోవ డం ద్వారా ఆయా అంశాలను త్వరగా రివిజన్‌ చేసుకోవ డానికి వీలుంటుంది. ఇందులో కెమికల్‌ బాండింగ్, ఆల్కైల్‌ హలైడ్, ఆల్కహాల్స్‌ అండ్‌ ఈథర్, కార్బొనైల్‌ కాంపౌండ్స్, అటామిక్‌ స్ట్రక్చర్‌ అండ్‌ న్యూక్లియర్‌ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్‌ అండ్‌ థర్మోకెమిస్ట్రీ అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. అంతేకాకుండా మోల్‌కాన్సెప్ట్, కోఆర్డినేషన్‌ కెమిస్ట్రీ, ఫినాల్స్, పీ బ్లాక్‌ ఎలిమెంట్స్, అటామిక్‌ స్ట్రక్చర్, గ్యాసియస్‌ స్టేట్, ఆల్డిహైడ్స్‌ అండ్‌ కీటోన్స్, జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, డీ అండ్‌ ఎఫ్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్‌పై అవగాహన పెంచుకోవాలి.

ఫిజిక్స్‌ : ఈ సబ్జెక్టుకు సంబంధించి బేసిక్‌ ఫిజిక్స్‌ కాన్సెప్ట్‌లపై అభ్యర్థులు పట్టు సాధించాలి. లాజికల్‌ థింకింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. సమస్యలను ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. ఫండమెంటల్స్‌పై పట్టు సాధించడానికి ఎన్‌సీఈఆర్‌టీ ఫిజిక్స్‌ బుక్స్, హెచ్‌సీ వర్మ, డీసీ పాండే ఫిజిక్స్‌ బుక్స్‌ను చదవాలి. అలాగే ఒక టాపిక్‌ మొదలు పెట్టినప్పడు దానికి సంబంధించిన సమస్యలను అదేరోజు పూర్తిచేసుకునే విధంగా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. ఇందులో ఎలక్ట్రో డైనమిక్స్, మెకానిక్స్‌ వంటివి కీలకమైన టాపిక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అలాగే హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, మోడ్రన్‌ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెచ్‌ఎం అండ్‌ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. అలాగే సెంటర్‌ ఆఫ్‌ మాస్, మూమెంటమ్‌ అండ్‌ కొలిజన్, సింపుల హార్మోనిక్‌ మోషన్, వేవ్‌ మోషన్‌ అండ్‌ స్ట్రింగ్‌ వేవ్స్‌లో లోతైన అవగాహన ఏర్పరచుకుంటే మంచి స్కోర్‌ చేసే అవకాశం ఉంటుంది. 

రివిజన్‌కు ప్రాధాన్యం
సబ్జెక్టుల వారిగా అన్ని టాపిక్స్‌ను పూర్తి చేసుకున్న తర్వాత రివిజన్‌కు ప్రాధాన్యం∙ఇవ్వాలి. ఆయా టాపిక్స్‌లోని ముఖ్యమైన అంశాలు తేలిగ్గా గుర్తుకు వచ్చేవిధంగా షార్ట్‌నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి. ఇది పరీక్ష ముందు రివైజ్‌ చేసుకోవడానికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. 

మాక్‌ టెస్టులతో స్పీడ్‌
విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలంటే.. ఎక్కువగా మాక్‌టెస్టులు, మోడల్‌ టెస్టులను రాయాలి. దీనివల్ల పరీక్షను వేగంగా నిర్దేశిత సమయంలోపు పూర్తిచేయడానికి వీలవుతుంది. అంతే కాకుండా మాక్‌ టెస్టులు విద్యార్థులు పరీక్షలో మంచి ప్రతిభ చూపేందుకు ఉపయోగపడతాయి. అలాగే ఆన్‌లైన్‌ పరీక్ష విధానంపైనా అవగాహన ఏర్పడుతుంది. 

సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదాతో ప్రయోజనాలెన్నో!

మరిన్ని వార్తలు