ప్రాంతీయ భాషల్లోనూ జేఈఈ మెయిన్‌

23 Oct, 2020 04:24 IST|Sakshi
రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌

వచ్చే ఏడాది నుంచి అమలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐఐటీ వంటి ప్రఖ్యాత ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (మెయిన్‌) రాసే అభ్యర్థులకు శుభవార్త. ఈ పరీక్షను ఇకపై మాతృభాషలోనే రాయొచ్చు. కంప్యూటర్‌ ఆధారిత జేఈఈ (మెయిన్‌)ను వచ్చే ఏడాది నుంచి పలు ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ చెప్పారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో భాగంగా మాతృభాష వినియోగాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఎన్‌ఈపీ విజన్‌ను దృష్టిలో పెట్టుకొని జేఈఈ(మెయిన్‌) టెస్టును పలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు(జేఏబీ) నిర్ణయించిందని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులు ఎక్కువ స్కోర్‌ సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు రమేశ్‌ పోఖ్రియాల్‌ గురువారం ట్వీట్‌ చేశారు.

జేఈఈ(మెయిన్‌) ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లో నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష పెట్టాలని పలు రాష్ట్రాల నుంచి చాలాకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. గుజరాతీ భాషలో జేఈఈ(మెయిన్‌) నిర్వహిస్తూ ఇతర భాషలను విస్మరించడం పట్ల గత ఏడాది పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విద్యా శాఖ వివరణ ఇచ్చింది. గుజరాత్‌ ప్రభుత్వం కోరడం వల్లే గుజరాతీ భాషలో పరీక్ష నిర్వహిస్తున్నామని, 2021 నుంచి 11 ప్రాంతీయ భాషల్లోనూ జేఈఈ(మెయిన్‌) ఉంటుందని వెల్లడించింది. జేఈఈ(మెయిన్‌) ఫలితాల ఆధారంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పించే రాష్ట్రాల భాషను ఇందులో చేర్చనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మాతృభాషలో ఇంజనీరింగ్‌ అడ్మిషన్‌ టెస్టు నిర్వహిస్తున్నారు. అలాంటి భాషల్లో మెయిన్‌ ఉంటుందని సమాచారం.

మరిన్ని వార్తలు