వీడియో: అవును.. అండర్‌వేర్‌లు కొనుక్కునేందుకు ఢిల్లీ వెళ్లా.. సీఎం సోదరుడి తీరుపై విమర్శలు

8 Sep, 2022 16:27 IST|Sakshi

రాంచీ: జార్ఖండ్‌ రాజకీయాల్లో ఊగిసలాట కొనసాగుతున్న వేళ.. ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు కొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయ్‌. అందులో సోదరుడు బసంత్‌ వ్యవహరశైలి కూడా మరింత కాకరేపుతోంది. డుమ్కా ఎమ్మెల్యే అయిన బసంత్‌ సోరెన్‌ తన నియోజకవర్గాల్లో జరుగుతున్న అఘయిత్యాలపై స్పందిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. 

డుమ్కా ప్రాంతంలో ఓ ప్రేమోన్మాది.. మైనర్‌పై పెట్రోల్‌ పోసి నిప్పు అంటించి చంపిన ఘటన, ఆ వెంటనే ఇద్దరు మైనర్ల హత్యాచార ఘటన చోటు చేసుకుంది. గత ఆరు నెలల్లో డుమ్కాలో మైనర్లపై దాడుల ఘటనలు ఏడుకు పైనే జరిగాయి. దీంతో జేఎంఎం పాలనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది బీజేపీ. ఈ తరుణంలో.. శాంతి భద్రతలు పర్యవేక్షించకుండా బసంత్‌ సోరెన్‌ ఢిల్లీ పర్యటించడం వివాదాస్పదంగా మారింది. 

ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన అనంతరం బసంత్‌.. మైనర్ల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా.. ఇక్కడ ఇంత నేరాలు జరుగుతుంటే ఢిల్లీకి ఎందుకు వెళ్లారంటూ మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన.. ‘‘నా దగ్గరి అండర్‌వేర్‌లు అయిపోయాయి. అందుకే వాటిని కొనుక్కునేందుకు ఢిల్లీకి వెళ్లా. కొనుక్కుని వచ్చా’’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారాయన. నిజంగానే అందుకే వెళ్లారా? అని మీడియా మరోసారి ప్రశ్నించగా.. ‘అవును..’ అంటూ సమాధానం ఇచ్చారాయ. వెటకారంగా ఆయన ఇచ్చిన సమాధానంపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. 

శిబు సోరెన్‌ కొడుకు, పేదల.. గిరిజనుల నేత అయిన బసంత్‌ సోరెన్‌.. ఢిల్లీకి అండర్‌వేర్‌లు కొనుక్కునేందుకు వెళ్లాడంటూ వెటకారంగా స్పందించింది బీజేపీ. ఇక జార్ఖండ్‌లో రాజకీయ అనిశ్చితి తలెత్తగా.. బల నిరూపణలో నెగ్గారు జేఎంఎం నేత, సీఎం హేమంత్‌ సోరెన్‌. ప్రస్తుతం అక్కడి రాజకీయాలు నిలకడగానే ఉన్నాయని ఆయన అంటున్నారు.

ఇదీ చదవండి: థర్డ్ ఫ్రంట్ కాదు.. మాది మెయిన్ ఫ్రంట్‌

మరిన్ని వార్తలు