Divya Pandey: క్రేన్‌ ఆపరేటర్‌ కూతురి సివిల్స్‌ ర్యాంక్‌ స్టోరీ! సన్మానం చేసిన కాసేపటికే..

4 Jun, 2022 13:07 IST|Sakshi

ఒక క్రేన్‌ ఆపరేటర్‌ కూతురు.. రోజుకు 18 గంటలపాటు కష్టపడింది. స్మార్ట్‌ఫోన్‌ ప్రిపరేషన్‌, అరకోర పుస్తకాలతో.. అందునా తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌ ర్యాంక్‌ కొట్టింది. పైగా ఆల్‌ ఇండియాలో 323వ ర్యాంక్‌ సాధించింది. ఈ కథ స్ఫూర్తిని ఇచ్చేదే. కానీ, ఇక్కడో ట్విస్ట్‌ ఆ అమ్మాయి ఆనందాన్ని ఆవిరి చేసింది. 

జార్ఖండ్‌ రామ్‌గడ్‌కు చెందిన దివ్య పాండే(24).. 2017లో రాంచీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకుంది. తాజాగా విడుదలైన యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో ర్యాంక్‌ సాధించడంతో ఆమెను మెచ్చుకోని వాళ్లంటూ లేరు. ఆమె తండ్రి సెంట్రల్‌ కోల్డ్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లో క్రేన్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. కోచింగ్‌ లేకుండానే ఆమె ఈ ఘనత సాధించడంతో.. మీడియా కూడా జోరుగా కథనాలు వచ్చాయి. అయితే..

ఆమె ఆనందం ఇప్పుడు ఆవిరైంది. ర్యాంక్‌ వచ్చింది ఆమెకు కాదని స్పష్టత వచ్చింది. దివ్య పాండే అక్క ప్రియదర్శిని పాండేకు యూపీకి చెందిన ఓ స్నేహితురాలు.. ఫోన్‌ చేసి ఫలానా దివ్య పాండేకు సివిల్స్‌ ర్యాంక్‌ వచ్చిందని చెప్పిందట. దీంతో ఆ దివ్య తన సోదరే అనుకుంది ఆమె. ఈ క్రమంలో ఇంటర్నెట్‌లో ఫలితాల కోసం సెర్చ్‌చేయగా.. ఆ టైంకి ఇంటర్నెట్‌ పని చేయలేదని చెబుతోంది ఆ కుటుంబం. 

అయినా ఆలోచించకుండా ర్యాంక్‌ వచ్చింది తమ బిడ్డకే అనుకుని ఆ కుటుంబం సంబురాలు చేసుకుంది. స్థానికులకు స్వీట్లు పంచుకుంది. ఈ విషయం మీడియాకు సైతం చేరింది. దివ్య పాండే తండ్రి జగదీశ్‌ ప్రసాద్‌ పాండే 2016లో సెంట్రల్‌ కోలార్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(సీసీఎల్‌) నుంచి క్రేన్‌ ఆపరేటర్‌గా రిటైర్‌ అయ్యాడు. దీంతో ఆ తండ్రి కష్టం ఫలించిందని అంతా అనుకున్నారు. విషయం తెలిసిన సీసీఎల్‌ అధికారులు, జిల్లా పాలనా సిబ్బంది దివ్య పాండేను పిలిపించుకుని ఘనంగా సత్కారం చేశారు.

అయితే ర్యాంకు వచ్చిన ఆనందంలో ఢిల్లీకి చేరిన ఆ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. ర్యాంక్‌ వచ్చింది జార్ఖండ్‌ రామ్‌గఢ్‌ జిల్లా చిట్టాపూర్‌లోని రాజ్‌రప్ప కాలనీకి చెందిన దివ్య పాండేకి కాదని అధికారులు చెప్పారు. ఆ ర్యాంక్‌ దక్షిణ భారత్‌కు చెందిన దివ్య పీ అనే అమ్మాయిది అని చెప్పడంతో ఆ కుటుంబం నిరాశగా వెనుదిగింది. అంతేకాదు ఈ పొరపాటుకు అందరికీ క్షమాపణలు చెబుతోంది. మరోవైపు ఈ తప్పిదం ఆధారంగా ఆ కుటుంబంపై ఎలాంటి చర్యలు ఉండబోవని అధికారులు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు