‘రోప్‌వే’ బాధితుల తరలింపు పూర్తి

13 Apr, 2022 05:27 IST|Sakshi
గాయాలపాలైన ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

మూడుకు చేరిన మృతులు 

60 మందిని రక్షించిన ఆర్మీ 

దేవ్‌గఢ్‌: జార్ఖండ్‌లోని దేవగఢ్‌లో ఆదివారం సాయంత్రం సంభవించిన రోప్‌వే ప్రమాదంలో చిక్కుకుపోయిన పర్యాటకుల తరలింపు పూర్తయింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి మొత్తం 60 మందిని బయటకు తీసుకువచ్చామని అదనపు డీజీపీ ఆర్‌కే మాలిక్‌ వెల్లడించారు. సుమారు 46 గంటలపాటు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది పాల్గొన్నారు. ఆది, సోమవారాల్లో కొందరిని సురక్షితంగా తీసుకురాగా మరో 15 మంది కేబుల్‌ కార్లలోనే ఉండిపోయిన విషయం తెలిసిందే. దట్టమైన అడవి, కొండప్రాంతం కావడంతో రాత్రి వేళ అధికారులు సహాయక చర్యలను నిలిపివేశారు.

అధికారులు వారికి డ్రోన్ల ద్వారా నీరు, ఆహార సరఫరాలను కొనసాగించారు. మంగళవారం ఉదయం తిరిగి సహాయక చర్యలు ప్రారంభించి, రెండు హెలికాప్టర్ల ద్వారా 14 మందిని సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. తరలింపు సమయంలో హెలికాప్టర్‌ నుంచి శోభాదేవి(60) ప్రమాదవశాత్తు జారి పడి చనిపోవడంతో ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరిందని అదనపు డీజీపీ ఆర్‌కే మాలిక్‌ వెల్లడించారు. కేబుల్‌ కార్లు ఢీకొన్న సమయంలో ఒక మహిళ చనిపోగా, గాయపడిన మరో 12 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు.

మరిన్ని వార్తలు