తన చెల్లికి వచ్చిన దుస్థితి మరోకరికి రాకూడదని..

28 Jul, 2021 10:36 IST|Sakshi

మానసిక మిత్ర.. ఈ ‘సుమిత్ర’

అసలే పేదరికం, దానికి తోడు పదహారేళ్ల చెల్లికి మానసిక ఆరోగ్యం అంతంత మాత్రం. డాక్టర్ల సలహామేరకు ట్రీట్మెంట్‌ ఇప్పించారు. కానీ మానసిక ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవడం, కుటుంబ సభ్యుల ఆదరణ అంతగా లేకపోవడంతో చెల్లి నిరాశా నిస్పృహలకు లోనై రైలు కింద పడి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఈ పరిణామాలన్నింటిని దగ్గర నుంచి గమనించిన 31 సంవత్సరాల అక్క సుమిత్ర గాగ్రై మనసు చలించి పోయింది. 

వైద్యం చేయించినప్పటికీ అవగాహన లేమి, కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం కారణంగా చెల్లి ప్రాణాలు కోల్పోవడంతో మానసిక ఆరోగ్యంపై ఎలాగైనా అందరిలో చైతన్యం తీసుకురావాలనుకుంది. మారుమూల గ్రామాల్లో గూడుకట్టుకున్న మూఢనమ్మకాలను దూరం చేసి వారిలో అవగాహన కల్పించాలనుకుంది. ఈ క్రమంలోనే జార్ఖండ్‌లోని పల్లెటూళ్లు, గ్రామాలు, గిరిజన తండాలను సందర్శించి వీధినాటకాలు, కథలు, చెప్పడం, వివిధ రకాల ఆటలు ఆడించడం ద్వారా మూఢనమ్మకాలు, మానసిక ఆరోగ్యంపై అక్కడి మహిళలకు అవగాహన కల్పిస్తోంది. 

‘హో’తెగకు చెందిన సుమిత్ర స్థానిక ఎజెక్ట్‌ ఎన్జీవో కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తూ...సెల్ఫ్‌హె ల్ప్‌ గ్రూపులకు, మహిళలకు మధ్య వారధిగా పనిచేస్తూ మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆమె కూడా గిరిజన మహిళ కావడంతో ఆయా గ్రామాల్లోని మహిళలతో సులభంగా కలిసిపోయి వారికి అర్థమయ్యేలా చెప్పేవారు. గత పన్నెండేళ్లుగా 24 మారుమూల గ్రామాలను సందర్శించి 36 వేల మందికిపైగా మహిళల జీవితాల్లో వెలుగులు నింపారు. మానసిక ఆరోగ్యంతోపాటు, మహిళలు పిల్లలు తీసుకోవాల్సిన పోషకాహారం, శిశు మరణాల రేటు తగ్గించడానికి కృషి చేస్తున్నారు. 

గిరిజన గ్రామాల్లో ప్రసవం అయిన తరువాత బొడ్డు తాడు కత్తిరించడం నుంచి శిశువును పరిశుభ్ర వాతావరణంలో ఉంచాలన్న అవగాహన లేమితో చాలామంది పురిటి శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో శిశు మరణాల రేటు అధికంగా ఉంటుంది. సుమిత్ర, తన ఎన్జీవో సభ్యులతో కలిసి అవగాహన కల్పించి మరణాల రేటును 45 శాతం తగ్గించారు. మానసిక ఆరోగ్యంపై సుమిత్ర చేసిన సేవను గుర్తించిన  కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) గతేడాది ‘ఉమన్‌ ఎగ్జంప్లర్‌’ అవార్డుతో సత్కరించింది. అంతేగాక ‘దలాన్సెట్‌’ మెడికల్‌ జర్నల్‌లో సుమిత్రా సేవా కార్యక్రమాలను ప్రస్తావించడం విశేషం.  

నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో, నీతి ఆయోగ్‌ ప్రకారం జార్ఖండ్‌ రాష్ట్రంలో మూఢనమ్మకాలు దయ్యం పిశాచి వంటి కారణాలతో మహిళలపై అనేక  దారుణాలు అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. సుమిత్ర వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ అవగాహన కల్పించడం ద్వారా ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. మహిళల మీద జరిగే అఘాయిత్యాలు, పోషకాహారంపై మంచి అవగాహన కల్పించడంతో ఇప్పుడు వారంతా మెరుగైన జీవనాన్ని సాగిస్తున్నారు. 

మరిన్ని వార్తలు