‘సివిల్స్‌’ అటెంప్ట్‌లు, వయోపరిమితిని సడలించం

25 Mar, 2022 07:33 IST|Sakshi

న్యూఢిల్లీ: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష(సీఎస్‌ఈ)కు సంబంధించి ప్రయత్నాల సంఖ్య(అటెంప్ట్స్‌), వయో పరిమితిపై ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను మార్చడం సాధ్యం కాదని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. కోవిడ్‌–19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వయో పరిమితి, అటెంప్ట్‌ల సంఖ్యలో సడలింపులు ఇవ్వాలంటూ సివిల్స్‌ అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయని చెప్పారు.

ఈ విషయంలో కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారని, రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల ప్రకారం.. సివిల్స్‌ ఎగ్జామ్‌ విషయంలో ప్రయత్నాల సంఖ్య(అటెంప్ట్స్‌), వయో పరిమితిపై ఇప్పుడున్న నిబంధనలను మార్చలేమని లిఖితపూర్వక సమాధానంలో జితేంద్ర సింగ్‌ తేల్చిచెప్పారు. సడలింపుల అంశాన్ని న్యాయస్థానం సమగ్రంగా పరిశీలించి, తీర్పులిచ్చిందని గుర్తుచేశారు. కోవిడ్‌–19 ప్రొటోకాల్స్‌ సక్రమంగా పాటిస్తూ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు నిర్వహించేందుకు యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయని వివరించారు.   

మరిన్ని వార్తలు