కశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం

30 Mar, 2021 05:54 IST|Sakshi
సోపోరులో రియాజ్‌ అంతిమయాత్ర దృశ్యం

కాల్పుల్లో మున్సిపల్‌ కౌన్సిలర్, సెక్యూరిటీ గార్డు  మృతి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ముష్కరులు మళ్లీ రెచ్చిపోయారు. మున్సిపల్‌ కౌన్సిలర్‌ను, ఆయన వ్యక్తిగత అంగరక్షకుడిని కాల్చి చంపారు. బారాముల్లా జిల్లాలోని సోపోరు పట్టణంలో సోమవారం ఈ దారుణం జరిగింది. మధ్యాహ్నం సోపోరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం జరుగుతుండగా గుర్తుతెలియని సాయుధులు లోపలికి ప్రవేశించారు. మున్సిపల్‌ కౌన్సిలర్‌ రియాజ్‌ అహ్మద్, సెక్యూరిటీ గార్డు షఫ్‌ఖాత్‌ అహ్మద్‌పై తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శంషుద్దీన్‌ పీర్‌ అనే మరో కౌన్సిలర్‌ గాయపడ్డాడు. జమ్మూకశ్మీర్‌ డీజీపీ విజయ్‌ కుమార్‌ ఘటనా స్థలాన్ని సందర్శించారు.

దుండగుల దుశ్చర్యపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ దాడిలో లష్కరే తోయిబాకు చెందిన ముదాసిర్‌ పండిట్‌ అనే ఉగ్రవాది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముష్కరులను పట్టుకొనేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కౌన్సిల్‌ సమావేశ మందిరంలోకి చొరబడి ఉగ్రవాదులు కాల్పులు జరపడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని విమర్శించింది. వారిని పట్టుకొని, కఠినంగా శిక్షించాలని బీజేపీ జమ్మూకశ్మీర్‌ అధ్యక్షుడు రవీందర్‌ రైనా డిమాండ్‌ చేశారు. మృతులకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఒమర్‌ అబ్దుల్లా సంతాపం తెలిపారు. ముష్కరుల అకృత్యాన్ని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన రియాజ్‌ అహ్మద్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, గెలిచారు.  
 

>
మరిన్ని వార్తలు