JK Cop Mother Emotional Video: నీ కడుపుకోత తీర్చలేం.. ‘జై హింద్‌ మాజీ’

24 Nov, 2021 15:43 IST|Sakshi

సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న వీడియో

వీరమాతకు సెల్యూట్‌ చేస్తున్న నెటిజనులు

సాక్షి, ఇంటర్నెట్‌: తల్లి ప్రేమ గురించి పూర్తిగా చెప్పడానికి ఈ ప్రపంచంలో సరైన పదాలు లేవు. అమ్మ అన్న పిలుపులో అమృతం ఉంటుంది. అందుకే దేవతలు సైతం.. ఆ ప్రేమను పొందడానికి మనుషులుగా పుడతారని చెప్పుకుంటారు. అంత గొప్పది తల్లి మనసు. తాను ఎలాంటి స్థితిలో ఉన్నా సరే బిడ్డ క్షేమం, సుఖసంతోషాల గురించి అనునిత్యం పరితపిస్తుంది.

తన ఆయుషు కూడా పోసుకుని బిడ్డ నిండ నూరేళ్లు.. చల్లగా బతకాలని కోరుకుంటుంది తల్లి. అటువంటిది.. తన కళ్ల ముందే బిడ్డ మరణిస్తే.. ఆ తల్లి కడుపుకోతను తీర్చే శక్తి ఎవరికి లేదు. ఆమె బాధ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. అది చూసి ప్రతి ఒక్కరి మనసు బాధతో విలవిల్లాడుతోంది. ఆ వివరాలు.. 

శత్రువులతో భీకరంగా పోరాడి వీర మరణం పొందిన అమరులకు బుధవారం ఢిల్లీలో అవార్డులు ప్రదానం చేశారు. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో 2019లో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ బిలాల్‌ అహ్మద్‌ మాగ్రే వీర మరణం పొందారు. ఈ ఆపరేషన్‌లో మాగ్రే తీవ్రంగా గాయపడినప్పటికి తన ప్రాణాలను పణంగా పెట్టి.. ముష్కరులతో భీకరంగా పోరాడి.. పౌరులను కాపాడాడు. ఈ క్రమంలో ఆయన మృతి చెందారు. మాగ్రే సాహసానికి గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు సైన్యంలో మూడవ అత్యున్నత పురస్కారం అయిన శౌర్య చక్రను ప్రకటించింది.
(చదవండి: ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లిన కశ్మీర్‌.. ఐదుగురు ఉగ్రవాదులు హతం )

అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా కొడుకు తరఫున ఈ పురస్కారాన్ని ఆందుకోవడానికి మాగ్రే తల్లి సారా బేగం ఢిల్లీకి వచ్చారు. ఇక అవార్డు ప్రకటించిన అనంతరం నాటి భద్రతా ఆపరేషన్‌లో మాగ్రే చూపించిన సాహసం.. ప్రాణాలు పణంగా పెట్టి ముష్కరులను ఎదిరించిన తీరు.. పౌరులను కాపాడిన విధానం గురించి వర్ణించారు. కొడుకు పేరు మైక్‌లో వినపడగానే ఆ తల్లి పేగు కదిలింది. బిడ్డ జీవితం అంతా ఆమె కళ్ల ముందు మెదిలింది. ఇక కుమారుడు లేడనే వాస్తవం ఆమెను ఉక్కిరిబిక్కిర చేసింది. 

లోపల నుంచి దుఖం తన్నకువచ్చింది. కానీ తాను ఏడిస్తే.. కొడుకు చేసిన సాహసం తక్కువవతుందని భావించిన ఆ తల్లి.. తన బాధను దిగమింగుకుంది. భోరున ఏడవాలని అనిపించినా.. అతి కష్టమ్మీద దుఖాన్ని ఆపుకుంది. అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ చేతుల మీదుగా కుమారుడికి లభించిన శౌర్యచక్ర పతకాన్ని ఆందుకుంది.
(చదవండి: 'నేను ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా')

ఆ తల్లి మనోవేదనకు సంబంధించిన వీడియో ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ వీరమాతకు సెల్యూట్‌ చేస్తున్నారు నెటిజనులు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న తర్వాత సారా బేగం తన వెనుక కూర్చున్న సీనియర్ మంత్రులను పలకరించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ తల్లిని ఓదార్చారు.
(చదవండి: ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!)

నాడు ఏం జరిగింది అంటే..
బారాముల్లాలోని ఓ ఇంటి వద్ద ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయని అవార్డుకు సంబంధించిన ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు. "బిలాల్ అహ్మద్ మాగ్రే స్వయంగా రూమ్ ఇంటర్వెన్షన్ ఆపరేషనల్ పార్టీలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అనంతరం ఆయన ఉగ్రవాదుల టార్గెట్ హౌస్‌లో చిక్కుకున్న పౌరులను ఖాళీ చేయించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో దాక్కున్న ఉగ్రవాది అనేక హ్యాండ్ గ్రెనేడ్లను కాల్చాడు’’.

‘‘మాగ్రేతో పాటు అతని కార్యనిర్వాహక సహచరులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఫలితంగా మాగ్రే, అతడి పార్టీ కమాండర్ ఎస్సై అమర్ దీప్, సోనూ లాల్ అనే ఒక పౌరుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి," అని ప్రశంసా పత్రంలో ఉంది.  అంతేకాక తీవ్రంగా గాయపడినప్పటికీ, మిస్టర్ మాగ్రే "అత్యంత ధైర్యాన్ని ప్రదర్శించి.. గాయపడిన వారిని, ఇతర పౌరులను బయటికి తరలించాడు" అని పేర్కొంది. దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికి. స్పృహ కోల్పోయే వరకు కాల్పులు జరుపుతూనే ఉన్నాడని పేర్కొంది.  

చదవండి: అంత్యక్రియల కోసం దాచిన సొమ్ము లూటీ.. పోలీసాఫీసర్‌పై ప్రశంసలు

మరిన్ని వార్తలు