Morbi Bridge Collapse: మోర్బీ బ్రిడ్జి దుర్ఘటన.. జో బైడెన్‌, కమలా హారిస్‌ సంతాపం

1 Nov, 2022 09:25 IST|Sakshi

గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ కష్ట సమయలో తాము భారతీయులకు అండగా నిలుస్తామని తెలిపారు. వంతెన కూలిన సమయంలో ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు గుజరాత్‌ ప్రజలతో కలిసి సంతాపం తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బైడెన్‌ ట్వీట్‌ చేశారు.

అదే విధంగా గుజరాత్‌ దుర్ఘటనపై అమెరికా వైఎస్‌ ప్రెసిడెంట్‌ కూడా స్పందించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. తమ హృదయాలు భారత్‌లో ఉన్నాయని, క్లిష్ట పరిస్థితుల్లో భారతీయులకు మద్దతుగా ఉంటామని తెలిపారు.

అంతులేని విషాదం
మోర్బి ప్రాంతంలో కూలిన బ్రిటిష్‌ కాలపు తీగల వంతెన విషాదం 140 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. మరో ఇద్దరి ఆచూకీ  తెలియాల్సి ఉంది. గుజరాత్‌ రాష్ట్రం మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై  నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి  ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి కూలిపోయిన విషయం తెలిసిందే. నదిపై కట్టిన తీగల వంతెన సెకన్ల వ్యవధిలో కూలిపోతుంటే, ఒకరి మీద మరొకరుగా వందల సంఖ్యలో జనం నదీ జలాల్లో పడిపోయిన తీరు కలిచివేస్తోంది.
చదవండి: శాపమా? పాలకుల పాపమా?

మొత్తం 140 మందికి పైగా సందర్శకులు ప్రమాదం బారినపడి అన్యాయంగా అసువులు బాసారు. ఆరంభించిన అయిదు రోజులకే రోప్‌ బ్రిడ్జి కూలిపోవడం మరమ్మత్తుల పనిలో నాణ్యతా లోపంతో, ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఘటనా ప్రాంతంలో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎయిర్‌ఫోర్స్‌, ఆర్మీ, భారత నేవీ సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.

ముమ్మాటికీ మానవ తప్పిదమే!
మోర్బీ వంతెన ప్రమాదానికి ముమ్మాటికీ మానవ తప్పిదమే కారణమని స్పష్టమవుతోంది. బ్రిడ్జికి ఫిట్‌నెట్‌ సర్టిఫికెట్‌ జారీ చేయలేదని, మున్సిపాలిటీ అనుమతి లేకుండానే దాన్ని పునఃప్రారంభించారని అధికారులు తెలిపారు. అంతేగాక ప్రమాద సమయంలో 500 మందికిపైగా జనం వంతెనపై ఉన్నారని స్థానికులు పేర్కొన్నారు. బరువు ఎక్కువై కూలిపోయిందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. తీగల సాయంతో వేలాడే ఈ వంతెన సామర్థ్యం కేవలం 150 మంది కాగా అంతకంటే ఎక్కువ మంది వెళితే ఆ బరువును తట్టుకోలేదు. అయినా ఈ విషయం తెలిసినప్పటికీ కాంట్రాక్ట్‌ సంస్థ ‘అజంతా ఒరెవా’ నిర్లక్ష్యంగా వ్యహరించి.. ఏకంగా 675 మంది సందర్శకులకు టిక్కెట్లు విక్రయించినట్లు  తెలిసింది.   
చదవండి: మోర్బీ వారధి విషాదం: మృతుల్లో 47 మంది పిల్లలు.. మరో వంద మందికిపైగా జలసమాధి!

కేసు నమోదు, అరెస్టులు
ఇప్పటివరకు 141 మృతదేహాలను వెలికి తీయగా అందులో రెండేళ్ల చిన్నారి సహా 47 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు.వంతెన కూలుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే కొంతమంది మంది కుర్రాళ్లు.. బ్రిడ్జిని ఒక్కసారిగా ఊపేశారని అందుకే ప్రమాదం జరిగిందంటూ ఓ బాధితుడు మీడియాకు తెలిపాడు.ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, త్రివిధ దళాల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

సీఎం భూపేంద్ర పటేల్, హోంమంత్రి హర్ష సంఘ్వీ ఆదివారం రాత్రి నుంచి అక్కడే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి ఇప్పటిదాకా 9 మందిని అరెస్టు చేసినట్లు గుజరాత్‌ పోలీసులు తెలియజేశారు. బ్రిడ్జి నిర్వహణ కాంట్రాక్టును పొందిన అజంతా ఒరెవా కంపెనీపై కేసు నమోదు చేశామని తెలిపారు.దర్యాప్తు సిట్‌ ఏర్పాటుచేశారు.

మరిన్ని వార్తలు