కోర్టుల్లో స్థానిక భాషలకు ఊతం

1 May, 2022 04:25 IST|Sakshi
సదస్సులో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ; సదస్సులో ప్రసంగిస్తున్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ

సీఎంలు, సీజేల సంయుక్త సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తద్వారా ప్రజలు న్యాయ ప్రక్రియతో అనుసంధానమైనట్లు భావిస్తారని, వారిలో విశ్వాసం పెరుగుతుందని అన్నారు. అంతిమంగా న్యాయ ప్రక్రియపై ప్రజల హక్కు బలపడుతుందని తెలిపారు. ఇప్పటికే సాంకేతిక విద్యలో స్థానిక భాషలను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తుచేశారు. చట్టాల గురించి సులభమైన భాషలో అర్థమయ్యేలా వివరించాలన్నారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో ప్రధాని ప్రారంభోపన్యాసం చేశారు. అండర్‌ ట్రయల్‌ ఖైదీల కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సూచించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే...

సదస్సుకు చాలా సీనియర్‌ని
‘‘దేశంలో న్యాయ వ్యవస్థ రాజ్యాంగ సంరక్షకుడి పాత్ర పోషిస్తోంది. సీఎంలు, సీజేల సంయుక్త సదస్సు రాజ్యాంగ సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం. నేను చాలాకాలంగా ఈ సదస్సుకు వస్తున్నా. మొదట ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రధానమంత్రిగా సదస్సుకు హాజరవుతున్నా. ఒకరకంగా చెప్పాలంటే ఈ సదస్సు విషయంలో నేను చాలా సీనియర్‌ని.  

డిజిటల్‌ ఇండియా మిషన్‌
డిజిటల్‌ ఇండియా మిషన్‌లో భాగంగా న్యాయ వ్యవస్థలో సాంకేతికతకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని సీఎంలు, ప్రధాన న్యాయమూర్తులు మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఈ–కోర్టుల ప్రాజెక్టును మిషన్‌ మోడ్‌లో అమలు చేస్తున్నాం. న్యాయ వ్యవస్థతో డిజిటల్‌ ఇండియాను అనుసంధానించాలి. బ్లాక్‌చెయిన్‌లు, ఎలక్ట్రానిక్‌ డిస్కవరీ, సైబర్‌ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బయోఎథిక్స్‌ వంటి సబ్జెక్టులను అనేక దేశాల్లో న్యాయ విశ్వవిద్యాలయాల్లో బోధిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత్‌లోనూ న్యాయ విద్యను అందించడం మన బాధ్యత. చట్టాల్లో సంక్లిష్టతలు, వాడుకలో లేని చట్టాలు చాలా ఉన్నాయి. 2015లో ప్రభుత్వం 1,800 చట్టాలను అప్రస్తుతంగా గుర్తించి ంది. ఇప్పటికే 1,450 చట్టాలను రద్దు చేశాం.

పెండింగ్‌ కేసులకు మధ్యవర్తిత్వం  
స్థానిక కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఒక ముఖ్యమైన సాధనం. మన సమాజంలో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం వేల సంవత్సరాలుగా ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మధ్యవర్తిత్వ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది.’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.


ఖాళీల భర్తీకి కృషి చేస్తున్నాం
మన దేశం స్వాతంత్య్రం పొంది 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవుతుంది. అప్పుడు దేశంలో ఎలాంటి న్యాయ వ్యవస్థను చూడాలనుకుంటున్నాం? 2047 నాటికి దేశ ఆకాంక్షలను నెరవేర్చగలిగేలా మన న్యాయ వ్యవస్థను ఎలా సమర్థంగా తీర్చిదిద్దాలి? ఈ ప్రశ్నలే ఈ రోజు ప్రాధాన్యతగా ఉండాలి. అమృత్‌ కాల్‌లో మన విజన్‌(దార్శనికత) అంతా సులభ న్యాయం, సత్వర న్యాయం, సమ న్యాయం కల్పించే న్యాయ వ్యవస్థపై ఉండాలి. న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివిధ స్థాయిల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నాం.

న్యాయ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం
♦ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ
♦ ప్రత్యక్షంగా ఎన్నికైన వారిని
♦ అందరూ గౌరవించాల్సిందే
♦ కోర్టుల నిర్ణయాలను ప్రభుత్వాలు
♦ ఏళ్ల తరబడి అమలు చేయట్లేదు
♦ అందుకే వ్యాజ్యాలు పెరుగుతున్నాయ్‌

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని, అందుకు మరిన్ని చర్యలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ చెప్పారు. న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకొన్న ప్రతినిధులను అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. కోర్టుల నిర్ణయాలు ఏళ్ల తరబడి అమలు కాకపోవడం వల్లే ప్రభుత్వాలపై ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాల విధి నిర్వహణ వైఫల్యం వల్ల కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు.

శనివారం ఢిల్లీలో రాష్ట్రాల సీఎంలు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో జస్టిస్‌ ఎన్‌వీ రమణ మాట్లాడారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్ర స్థాయిలో స్పెషల్‌ పర్సస్‌ వెహికల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. సీఎంలు లేదా వారి తరపు ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. ఇందుకు ముఖ్యమంత్రులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలున్న ప్రజాప్రతినిధుల నుంచి ఎంతో నేర్చుకొనే అవకాశం వచ్చిందని జస్టిస్‌ ఎన్‌వీ రమణ తెలిపారు. న్యాయ వ్యవస్థ పనితీరును మెరుగుపర్చడానికి, ప్రస్తుతం ఉన్న సవాళ్లను  గుర్తించి, పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని వివరించారు. సదస్సులో ఆయన ఇంకా ఏం చెప్పారంటే...

పెండింగ్‌ కేసులు 4.11 కోట్లు: న్యాయ వ్యవస్థలో ఖాళీలను త్వరగా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. న్యాయమూర్తులు–జనాభా నిష్పత్తిని పెంచేందుకు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కృషి చేయాలి. అన్ని హైకోర్టుల్లో 1,104 జడ్జీల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయగా, ప్రభుత్వం 388 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీల భర్తీకి నేను పదవిలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రయత్నిస్తున్నా. మరోవైపు ఈ ఆరేళ్లలో పెండింగ్‌ కేసుల సంఖ్య 2.65 కోట్ల నుంచి 4.11 కోట్లకు పెరిగింది.  

‘పిల్‌’ దుర్వినియోగం
కోర్టుల్లో అనవసరమైన వ్యాజ్యాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్‌) కొన్నిసార్లు వ్యక్తిగత ప్రయోజనాల వ్యాజ్యాలుగా మారుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజా ప్రయోజనాలను కాపాడాల్సిన ‘పిల్‌’ను కొన్నిసార్లు ప్రాజెక్టులను నిలిపివేయడానికి, ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకురావడానికి దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయ అవసరాలు నెరవేర్చుకోవడానికి, కార్పొరేట్లపై కక్ష తీర్చుకోవడానికి ‘పిల్‌’ ఓ సాధనంగా మారడం విచారకరం. కోర్టుల్లో భాషాపరమైన అడ్డంకులు తొలగించడం, సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఖాళీల భర్తీ, న్యాయ వ్యవస్థ బలాన్ని పెంపొందించడం వంటివి తక్షణావసరం’’ అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ పిలుపునిచ్చారు.

కోర్టుల్లో స్థానిక భాషలు.. ఒక్కరోజులో సాధ్యం కాదు
కోర్టుల్లో స్థానిక భాషను ప్రవేశపెట్టడం వంటిసంస్కరణలను అమలు చేయడం ఒక్కరోజులో సాధ్యం కాదని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ చెప్పారు. కొన్ని ప్రతికూలతలు ఉన్నందువల్ల దాన్ని అమలు చేయడానికి కొంత సమయం పడుతుందన్నారు.

మరిన్ని వార్తలు